పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సంఘటనలు ముగిసాక ఓ మెల్లని స్వరం విన్పించింది. ప్రభువు మృదువైన స్వరంతో యావే అనే తన పేరుని విన్పించాడు. ప్రవక్తనుగూడ పేరెత్తి పిల్చాడు - 13. ఇదే దైవసాక్షాత్కారం. ఈ యధ్యాయమంతటిలోను ముఖ్యమైన వాక్యం ఇదే. అది దేవుని స్వరమని యేలీయా వెంటనే గుర్తించాడు. కనుకనే అతడు భయభక్తులతో తన అంగీ చెంగుతో ముఖాన్నికప్పుకొన్నాడు. అపవిత్రుడైన నరుడు మహాపవిత్రుడైన దేవుణ్ణి కంటితో చూడకూడదు.

ఇక్కడ ప్రవక్తకు ప్రభువు స్వరం మెల్లగా విన్పించింది. దీని భావమేమిటి? ప్రభువు తన భక్తుడైన యేలీయాకు ఆత్మీయుడూ సన్నిహితుడూ అయ్యాడని అర్థం. మనం ఎదుటవున్నవాళ్ళతో పెద్దగాగాక మెల్లగా మాట్లాడతాం. గుసగుసలాడతాం. కనుక ఇక్కడ ప్రవక్త యావే యెదుట నిల్చివున్నాడని భావం. అతనికి ప్రభువు సాక్షాత్కారం కలిగిందని ఫలితార్థం.

ఈ దైవదర్శనంతో ఏలీయా నిరుత్సాహమూ విషాద భావాలు తొలగిపోయాయి. అతనికి మళ్ళీ ధైర్యంవచ్చింది. ప్రవక్త సమరియా దేశంలో తాను చేస్తున్న ప్రభువు పనిని ఆపివేసి నిరాశతో ఈ కొండకు వచ్చాడు. ప్రభువు అతన్ని ఉత్తేజపరచి మళ్లా పూర్వపు పనిమీద పంపాడు.

యావే ఏలీయాకు మూడు విషయాలు చెప్పాడు. 1) ప్రవక్త యావే మతోద్ధరణ కార్యక్రమాన్ని మానివేయకూడదు. కనుక అతడు తనకు వారసునిగా యెలీషాను అభిషేకించాలి-16. 2) యిప్రాయేలీయులలో భక్తివిశ్వాసాలు లేనివారిని హసాయేలు, యెహూ మొదలైనవాళ్లు శిక్షిస్తారు. 3) ఏలీయా తాను వంటరిగాడినని భయపడనక్కరలేదు. ప్రభువు అతనికి భక్తిమంతులైన యిస్రాయేలీయులను ఏడువేలమందిని తోడుగా ఇస్తాడు. వాళ్ళు బాలుని ఎంతమాత్రం కొలవరు.

ఈ దర్శనం ద్వారాను ఈ సందేశం ద్వారాను ప్రవక్త ఉత్తేజాన్ని తెచ్చుకొని కొండ దిగి వచ్చాడు. ఏలీయా తన దేశానికి తిరిగిరాగా ఓ తావులో ఎలీషా పొలం దున్నుతూ కన్పించాడు. ఇతడే ఏలీయాకు వారసుడు. కనుక ఏలీయా తన అంగీని తీసి దానితో యెలీషాను కప్పాడు. ఈ యంగీ దాన్ని తాల్చిన వ్యక్తినీ, ఆ వ్యక్తి హక్కులనూ తెలియజేస్తుంది. కనుక ఇక్కడ రెండంశాలను గుర్తించాలి. 1. ఏలీయా తన అంగీతో యెలీషాను కప్పడం ద్వారా అద్భుతాలుచేసే గురువశక్తి శిష్యుల్లోకి ప్రవేశించింది. యేలీయా దాటిపోయాక అతని అద్భుతాలను ఈ శిష్యుడు కొనసాగిస్తాడు. 2. గురువుకి శిష్యునిమీద హక్కులుంటాయి. కనుక యొలీషా ఇంటికివెళ్ళి తల్లిదండ్రులవద్ద సెలవు తీసికొని మళ్ళా గురువు దగ్గరికి రావాలి. అతని వుద్యమాన్ని కొనసాగించాలి.

ఎలీషా తాను పొలందున్నుతూన్న రెండెద్దులను వధించి మాంసం వండి 'తనతోపాటు వ్యవసాయంచేసే తోడి పనివారికి వడ్డించాడు. వాళ్ళంతా భుజించారు.