పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిలుపునందుకొన్న గురువులూ మఠకన్యలూ మొదలైనవాళ్ళంతా పూర్వపు పాపజీవితాన్ని వదలివేసి వినూత్నమూ పవిత్రమూ ఐన ప్రేషిత జీవితానికి పూనుకోవాలి.

6. మోషే యేలీయాలకు పోలికలున్నాయి. ఇద్దరూ కొండమీద దేవుణ్ణి చూచారు. ఇద్దరూ మళ్ళా తబోరుకొండ మీద మారురూపం దాల్చిన క్రీస్తుని చూచారు - మత్త 17,2. ఏలీయా నూత్నావేదంలో క్రీస్తుకి పురోగామిగా వస్తాడు అనుకొన్నారు. ఆ మహాభక్తులు మనకొరకు ప్రార్ధనం చేయాలని వేడుకొందాం.


14. నాబోతు ద్రాక్షతోట


1రాజు 21


1. సందర్భం

ఈ యధ్యాయం పేర్కొనే నాబోతు సంఘటనం సాంఘిక అన్యాయాన్ని తెల్పే కథ. ఇది మొదటి రాజుల గ్రంథంలోని రెండు సిరియా యుద్ధాలమధ్య చేర్చబడింది. నాబోతుపై కుట్రపన్ని అతన్ని చంపించిన సూత్రధారిణి అహాబు భార్య యెసెబెలు. ఆమె అంతకుముందే యావే ప్రవక్తలనుగూడ చంపించింది. యావే ప్రవక్తయైన ఏలీయా నిర్భయంగా రాజుని ఎదిరించి అతని అన్యాయానికి తిగిన శిక్షను ఎరిగించాడు. ఈ కథ ప్రవక్తల ఆధిక్యాన్ని తెలియజేసేది, ప్రవక్తల సంప్రదాయానికి చెందింది. ఇది పూర్వవేదంలోని సుప్రసిద్ధమైన కథల్లో వొకటి.


2. వివరణం

అహాబు ఉత్తర రాజ్యమైన సమరియాకు చెందినవాడు. ఆ రాజ్యానికి రాజధానికూడ సమరియా నగరమే. కాని యిక్కడ చలి విపరీతంగా వుంటుంది. అందుచే ఆ రాజు చలి తక్కువగా వుండే యెసెయేలు పట్టణాన్ని రెండవ రాజధానిగా చేసికొన్నాడు. మన కథ ఈ నగరంలో జరిగింది.

నాబోతు యెసెయేలు పట్టణంలో పదిమందికీ తెలిసిన పేదరైతు. నీతి నిజాయితీలు కలవాడు. అతని చేను రాజు ప్రాసాదానికి ఆనుకొనివుంది. కనుక రాజు దానిని తీసికోగోరాడు. దానికి బదులుగా రైతుకు మరో చేనుగాని లేక సరిపడిన వెలకాని యిస్తానన్నాడు. కాని నాబోతు తన చేనుని వదలుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. అది అతనికి తండ్రి తాతలనుండి వచ్చిన పొలం. అతడు దాన్ని మళ్ళా తన పత్ర పౌత్రులకు వదలివెళ్లాలి. యిస్రాయేలు దేశంలోని భూమి అంతా ప్రభువుదే. ఆ నేలను