పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వతంత్రరాజ్యాన్ని ఏర్పరచుకొన్నారు. రెహబాము తన సైన్యాధిపతి అదోరాముని ఉత్తరపు తెగల మీదికి పంపాడు. కాని వాళ్ళతన్ని వధించారు. రాజుకూడ యెరూషలేముకి పారిపోయి ప్రాణాలు దక్కించుకోవలసి వచ్చింది. ఉత్తర తెగవాళ్ళు యరోబాముని రాజుగా ఎన్నుకొన్నారు. అతడు సమరియా పట్టణాన్ని రాజధానిగా జేసికొని ఉత్తర రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. దక్షిణాన యెరూషలేమునుండి రెహబాము రెండు తెగల వాళ్ళను పాలించాడు. అటుపిమ్మట రెహబాబు ఉత్తరరాజ్యం వాళ్ళను లొంగదీసుకోవడానికై పెద్ద సైన్యంతో యుద్దానికిపోయాడు. కాని షెమయా అనే ప్రవక్త ప్రభువు పంపగా వచ్చి రెహబాముతో ఈ రాజ్య విభజనం ప్రభువు సంకల్పం వలన జరిగింది. కనుక మీరు మీ సోదరులైన ఉత్తరాది తెగల వారిమీదికి పోకండి అని చెప్పాడు. రెహబాము యుద్ధం చాలించి వెనుకకు వచ్చాడు. ఈ విధంగా సొలోమోను విగ్రహారాధనం వలన, రెహబాము మూర్ఖత్వం వలన యిస్రాయేలు రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది. ఇది ప్రభువు నిర్ణయించిన కార్యం ప్రవక్తలు దీన్ని ముందుగానే తెలియజేసారు. అంతా వాళ్లు చెప్పినట్లే జరిగింది. రాజ్యవిభజనం క్రీస్తుపూర్వం 931లో జరిగింది. 722లో ఉత్తర రాష్ట్రం అస్సిరియా రాజుకు చిక్కి నాశమైపోయింది. అంతవరకు, అనగా 209 యేండ్లకాలం ఆ రెండు రాజ్యాలు పరస్పరం పోట్లాడుకొంటూ వచ్చాయి.

3. ప్రార్ధనా భావాలు

1. చరిత్రగతిని నడిపించేవాడు ప్రభువు. అతడు సాలోమోను పాపాలకు శిక్షగా యిస్రాయేలు రాజ్యాన్ని విభజించాలనుకొన్నాడు. ఆ సంగతిని అహీయా ప్రవక్తద్వారా ముందుగానే ఎరిగించాడు. సొలోమోను సేవకుడైన యరోబాముని రాజుని చేసాడు. రెహబాము ఉత్తర రాజ్యం మీదికి దండెత్తబోతూంటే షమయా ప్రవక్తద్వారా ఆ ప్రయత్నాన్ని వారింపజేసాడు. ఈ యంశాలనుండి మనం చరిత్రగతిని నడిపించేవాడు ప్రభువేనని అర్థంజేసికోవాలి. అతడు నేడు మన జీవితంలోని సంఘటనలనుగూడ నడిపిస్తూంటాడు. అతని అనుమతి లేనిదే మనకు మంచీ జరగదు, చెడ్డా జరగదు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకు అన్నీ అనుకూలంగానే జరిగిపోతాయి-రోమా 8,28. కనుక భక్తిమంతులు తమ జీవితంలో జరిగే ప్రతిసంఘటనంలోను దేవుని హస్తాన్ని దర్శిస్తారు.