పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇక దావీదు వూరియాను ఏలాగైన వదలించుకొని బత్నెబాను పెండ్లిచేసికోవాలనుకొన్నాడు. కనుక అతడు యోవాబుకి ఓ జాబు వ్రాసి దాన్ని వూరియా చేతనే పంపాడు. దానిలో "నీవు పోరు భీకరంగా జరిగే తావున వూరియాను మొదటి వరుసలో పెట్టించు. శత్రువులువచ్చి అతనిమీద పడినప్పడు మీరతన్ని ఆదుకోవద్దు" అని వ్రాసాడు. ఊరియా ఈ జాబుని సేనాధిపతి దగ్గరికి తీసికొనిపోవడం వలన తన చావుకబురుని తానే మోసికొనిపోయి నట్లయింది. యుద్ధంలో మొదటి వరుసలో వున్నవాళ్ళకు అపాయమెక్కువ. ప్రాణాలకు తెగించి పోరాడే శూరులనే మొదటి వరుసలో వంచుతారు.

జాబును చూడగానే యోవాబుకి దావీదు కుట్ర అర్థమైంది. అతడు రాజు చెప్పినట్లే చేయగా వూరియా యుద్ధంలో చనిపోయాడు. యోవాబు రాజునొద్దకు దూతనంపి యుద్ధవార్తలు చెప్పించాడు. తాము శత్రువుల నగరమైన రబ్బాను ముట్టడిస్తుండగా యిస్రాయేలు వీరులు కొందరు మరణించారనీ వారిలో ఊరియాకూడ వున్నాడనీ చెప్పించాడు. దావీదు దూతతో యుద్ధంలో ఎవరు చస్తారో ఎవరు బ్రతుకుతారో చెప్పలేం. జరిగినదానికి చింతించవద్దు. మీరు యుద్దాన్ని ఇంకా తీవ్రంచేసి రబ్బా పట్టణాన్ని జయించండి అని చెప్పాడు. రాజుకి కావలసింది వూరియా చావు. అతనితోపాటు ఇంకా కొందరు వీరులు కూలినా దావీదుకి చింతేమీ లేదు.

వూరియా పోయాడు కను బెత్షెబా దావీదుకి సాంతమైపోయింది. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా? అతడు ఆమెను తన మేడకు రప్పించుకొని పెండ్లి చేసికొన్నాడు. అటుపిమ్మట ఆమె బిడ్డను కంది. ఇక్కడ దావీదు కేవలం కామతృప్తికొరకే బత్షెతెబాను పెండ్లి చేసికొన్నాడు అనుకోగూడదు. పెనిమిటి పోయాడు కనుక దిక్కులేని బత్షెబాను ఆమె బిడ్డణ్ణి కాపాడ్డానికి అతడు ఆమెను పరిణయమాడాడు అని చెప్పాలి.

కాని దావీదు చేసిన ఈ దుష్కార్యం యావేకు కోపం కలిగించింది. అతడు ఓ పేదవాణ్ణి అన్యాయంగా చంపించి అతని భార్యను అపహరించాడు. కాని మోషే ధర్మశాస్త్రం ప్రకారం యిస్రాయేలీయులను నడిపించే ప్రభువు రాజు అధర్మాన్ని ఏలా సహిస్తాడు? కనుక అతడు దావీదుని చీవాట్లు పెట్టడానికి తన భక్తుడైన నాతాను ప్రవక్తను పంపాడు. ప్రవక్తలు ప్రభువు సందేశాన్ని ప్రజలకు ఎరిగించేవాళ్లు. తాము ప్రభువుకి నోరై మాటలాడేవాళ్ళు.

దావీదు సామాన్యుడు కాదు, రాజు. కనుక ప్రవక్త అతన్ని నేరుగా మందలించకూడదనుకొన్నాడు. ఓ కథ ద్వారా అతని అంతరాత్మకు ప్రబోధం కలిగించాలనుకొన్నాడు. కావున నాతాను దావీదుకి ఈ కథ చెప్పాడు. అయ్యా! ఎంత అన్యాయం జరిగిందో చూచావా! ఓ నగరంలో ఓ పేదవాడూ ఓ ధనికుడూ వసిస్తున్నారు.