పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. వివరణం

అది యుద్ధకాలం. దావీదు సైన్యాధిపతియైన యోవాబు రెండవ అమ్మోనీయుల యుద్దాన్ని నడిపిస్తూ రబ్బా పట్టణంలో వున్నాడు. దావీదు యెరూషలేమున వున్నాడు. ఒకనాటి సాయంకాలం అతడు రబ్బాయుద్ధాన్ని గూర్చి ఆలోచిస్తూ తన మేడమీద పచార్లు చేస్తున్నాడు. ప్రక్కింటి ఆడగూతురు బెత్షెబా స్నానం చేసికొంటూ అతని కంటబడింది. ఆమెను చూడగానే రాజుకి మతిపోయింది. అతను బెత్షెబాను గూర్చిన వివరాలు అడగ్గా ఆమె ఊరియా భార్య అని తెలిసింది. ఈ వూరియా హిత్తీయుడు. దావీదుకి అంగరక్షకుడు. ముప్పదిమంది వీరుల్లో ఒకడు.

దావీదు కామవికారానికి లొంగి బెత్షెబాను ప్రాసాదానికి రప్పించుకొని ఆమెతో పాపంచేసాడు. ఆ పాపఫలితంగా ఆమెకు గర్బం కలిగింది. ఆమె గర్భవతి ఐనప్పటినుండి రాజు పన్నాగాలకు పూనుకొన్నాడు. బత్షెబా తనవలనగాక తన భర్తయైన ఊరియావల్లనే గర్భవతి ఐనట్లుగా నిరూపించాలని అతని తపన.

కనుక అతడు రబ్బాలో అమ్మోనీయులతో పోరాడుతూన్న ఊరియాను యెరూషలేముకి పిలిపించాడు. అతని నుండి యుద్ధవార్తలు విన్నాడు. సాయంకాలం అతన్ని యింటికి పొమ్మన్నాడు. అతడు ఆ రేయి ఆలిని కూడతాడని భర్తవల్లనే బెత్షెబాకు గర్భం కలిగినట్లుగా ప్రచారం చేయవచ్చునని దావీదు తలంపు.

కాని వూరియూ ఆ రాత్రి యింటికి పోనేలేదు. రాజు మేడ ముందటనే అంగరక్షకుల ప్రక్కన పండుకొని నిద్రించాడు. దావీదు నీవు మీ యింటికేల పోలేదని ప్రశ్నింపగా వూరియా ప్రభూ! దైవమందసంతోపాటు యిప్రాయేలు సైనికులుకూడ గుడరాంలోనే పడివున్నారు. యుద్ధకాలంలో యోవాబు అతని అంగరక్షకులు బయటనే నిద్రిస్తున్నారు. ఈలాంటి పరిస్థితుల్లో నేను హాయిగా తిని త్రాగి ఆలిని కూడతానా? నేను అలాంటిపని చేసేవాణ్ణికాదు అన్నాడు.

యిస్రాయేలు సంప్రదాయం ప్రకారం యుద్ధం పవిత్రమైంది. కనుక యుద్ధకాలంలో సైనికులకు భార్యా సంగమం నిషిద్ధం - 1సమూ 21,4-5. ఇక్కడ అన్యజాతివాడైన హిత్తీయుడు ధర్మశాస్త్ర నియమాలను జాగ్రత్తగా పాటించాడు, అతని శీలం గొప్పది. భక్తుడైన దావీదు మాత్రం ధర్మశాస్త్ర నియమాలను మీరాడు. ఇది విడూరం.

మళ్ళా రెండవసారి దావీదు వూరియాను అతని ఇంటికి పంపగోరాడు. కనుక ఆ మరునాడు అతన్ని తనతోపాటు భోజనానికి ఆహ్వానించి తప్పత్రాగించాడు. మధుపానం లైంగికవాంఛలను రెచ్చగొడుతుంది. ఐనా వూరియా లొంగలేదు. ఆ రేయికూడ అతడు యింటి వెళ్ళక రాజు అంగరక్షకుల ప్రక్కనే పండుకొని నిద్రపోయాడు.