పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా రాతిగుళ్ళులేని ఆ ప్రాచీనకాలంలో ఈ ఆదర్శ కుటుంబాలే దేవాలయాలుగా పనిచేసాయి. ప్రాచీన క్రైస్తవులు ఈ యిండ్లల్లోనే గుమిగూడి ప్రార్థనలు చేసికొనేవాళ్లు. పూజబలిని అర్పించేవాళ్లు, కావుననే వాటిని కుటుంబ దేవాలయాలు అన్నారు. నేటి మన కుటుంబాలుగూడ దేవాలయాలుగా పనిచేయాలి. ఇక్కడ తలిదండ్రులు తమ పిల్లలకు తొలిసారిగా భక్తివిశ్వాసాలు, ప్రార్థన నేర్పాలి. విద్యాబుద్దులు నేర్చి వారిని భావిజీవితానికి సిద్ధం జేయాలి. ఆ పిల్లల్లో ఎవరికైనా దైవసేవమీద కోరిక పుడితె ఆ కోరికను బలపరచాలి.

2. గృహస్తుల యాజకత్వం

తిరుసభలో గురువుల యాజకత్వమూ వుంది. గృహస్థల యాజకత్వమూ వుంది. కుటుంబంలో తల్లిదండ్రీ బిడ్డలూ అందరూ కలసి గృహస్థ యాజకత్వాన్ని నెరపుతారు. భక్తితో పూజలో పాల్గొని తమ జీవితాలను సజీవయాగంగా దేవునికి అర్పించుకొంటారు రోమా 12,1. పవిత్ర గ్రంథాన్ని చదివి అది ఆదేశించినట్లుగా దేవుని మార్గాల్లో నడుస్తారు. దైవ సోదర ప్రేమలను పాటిస్తారు. స్వార్ధాన్ని అణచుకొని పరోపకారబుద్ధితో జీవిస్తారు. కష్టపడి పనిచేసికొంటారు. తమ పవిత్ర జీవితం ద్వారానే దైవరాజ్యం వచ్చిందని చాటిచెప్తారు. క్రైస్తవ గృహమూ దానిలో వసించే కుటుంబమూ క్రైస్తవ జీవితం ఈలా వుంటుందని లోకానికి చాటిచెప్పేదిగా వుండాలి. క్రీస్తుకీ అతని విలువలకూ సాక్ష్యమిచ్చేదిగా వుండాలి.

జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవులు క్రీస్తుతో ఐక్యమై అతని రాజత్వం, ప్రవక్తృత్వం, యాజకత్వం అనే మూడు గుణాల్లో పాలుపొందుతారు. సజీవ శిలలై ఆధ్యాత్మిక దేవాలయంగా రూపొందుతారు - 1షేత్రు 2,5. దేవునిచే ఎన్నుకొనబడినవారు, రాచరికపు గురుకులం, పవిత్ర ప్రజ ఔతారు. చీకటినుండి వెలుగులోనికి వచ్చి, దేవుని అద్భుతకార్యాలను ప్రకటిస్తారు - 2,9.

3. తల్లిదండ్రులూ పిల్లలూ

కుటుంబంలో వసించేది తల్లిదండ్రులూ పిల్లలూ, తల్లిదండ్రులు పరస్పర ప్రేమభావంతోను ఐక్యభావంతోను జీవించాలి. క్రీస్తుకీ తిరుసభకీ వుండే పవిత్ర బంధాన్ని తమ దాంపత్యజీవితం ద్వారానే చూపింపగలిగి వుండాలి.

తల్లిదండ్రులు తమ తరపున తాము పిల్లలను ఆప్యాయంగా పెంచి పెద్దజేయాలి. విద్యాబుద్దులు నేర్చి వారిని భావిజీవితానికి తయారుచేయాలి. ఆ బిడ్డలు తమ బిడ్డలు కాకముందే దేవుని బిడ్డలు. కనుక వారికి విశ్వాసవిద్య దైవభక్తి నేర్పాలి. నైతిక గుణాలూ సచ్ఛీలము అలవర్చాలి. పిల్లలకు మొదటి మతబోధకులు తల్లిదండ్రులే