పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భర్తతో ఐక్యమైన ఈ నీ కొమార్తెను కనికరంతో వీక్షించు. ఈమె నీయాశీర్వాదాన్ని అడుగు కొంటూంది. ఈమెకు ప్రేమనూ శాంతినీ ప్రసాదించు. ఈమె ఎల్లవేళల పవిత్రగ్రంథం పేర్కొనే పుణ్యస్త్రీల మార్గంలో నడచునుగాక.

ఈమె భర్త ఈమెను విశ్వసించునుగాక. ఈమె తనకు సరిసమానమనియు, వరప్రసాద జీవితం వలన తనతోపాటు మోక్షానికి వారసురాలనియు గుర్తించునుగాక. క్రీస్తు తన పత్నియైన తిరుసభను ప్రేమించినట్లే ఇతడును ఈమెను సదా ఆదరించి ప్రేమించునుగాక.

పరలోక తండ్రీ! వీళ్ళు సదా నీ యాజ్ఞలను పాటింతురుగాక. వీళ్ళు వివాహబంధంలో పరస్పరం విశ్వసనీయులుగా మెలుగుదురుగాక, తోడి క్రైస్తవులకు ఆదర్శంగా వుందురుగాక. సువిశేష సందేశంనుండి లభించే బలాన్ని పొంది క్రీస్తుకి సాక్షులుగా నిల్లురుగాక. ప్రభూ! వీరికి సంతాన భాగ్యాన్ని దయచేయి. మంచి తల్లిదండ్రులుగా మెలిగే వరాన్ని ప్రసాదించు. వీళ్ళు తమ బిడ్డల బిడ్డలను కాంతురుగాక. వృద్ధాప్యం వరకు సుఖసంతోషాలతో జీవింతురుగాక. అటుపిమ్మట నీ దివ్యరాజ్యంలో అర్చ్యశిష్టులతోపాటు శాశ్వతంగా వసింతురుగాక. మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని ఆలించండి, ఆమెన్.

13. కుటుంబ దేవాలయాలు

1. కుటుంబాలే దేవాలయాలు

బాలయేసు మరియా యోసేపులతో గూడిన తిరుకుటుంబంలో జన్మించి వారి అండదండలలోనే పెరిగాడు. ఈ తిరుకుటుంబం నేటి మన కుటుంబాలన్నిటికీ ఆదర్శంగా వుండాలి. ఇక, నేటి మన తిరుసభకూడ దైవకుటుంబమే. తొలినాళ్ళలో భక్తులు కుటుంబసమేతంగా జ్ఞానస్నానంపొంది తిరుసభగా ఏర్పడ్డారు. ఫిలిప్పిలోని చెరసాల అధిపతి కుటుంబం ఈలాంటిది - అ. చ. 16,31. కొరింతులోని ప్రార్థనామందిరాధికారి క్రిస్పు కుటుంబం ఈలాంటిది - 18,8. ఈ పవిత్ర కుటుంబాలు ఆనాటి అవిశ్వాసాంధకారంలో దీపాల్లా ప్రకాశించాయి.

నేటి లోకంలో విశ్వాసం తగ్గిపోతూంది. ఈ లౌకిక యుగంలో విశ్వాసంతో జీవించే కుటుంబాలు చాల అవసరం. క్రైస్తవ ప్రజల్లో భక్తి, విశ్వాసం సోదరప్రేమ నిలబెట్టేది ఈ కుటుంబాలే. కావుననే రెండవ వాటికన్ మహాసభ ఈ సత్ముటుంబాలను “కుటుంబ దేవాలయాలు" అని పేర్కొంది. ఈపదం మొదట తొలినాటి క్రైస్తవ కుటుంబాలకు వర్తించేది.