పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంటనే తల్లి తన వ్రేలి ఉంగరాన్ని కుమారునికి చూపించి నాయనా! ఈ వుంగరం లేకపోతే నీవసలు పట్టివుండేవాడివే కాదు అంది. వివాహంద్వారా దైవసేవకు అంకితమయ్యే గురువులనూ మఠకన్యలనూ కనే తల్లిదండ్రులు ధన్యులు కదా! 5. పురాతన వ్యవస్థ వివాహ వ్యవస్థ మానవజాతి ఎంత ప్రాచీనమైందో అంత ప్రాచీనమైంది. సృష్ట్యాదిలోనే దేవుడు "నరుడు ఒంటరిగా జీవించడం మంచిదికాదు" అనుకొన్నాడు - ఆది 2,18. "మీరు బిడ్డలను పెక్కండ్రనుకని వృద్ధిచెంది భూమండలమంతట వ్యాపించండి" అన్నాడు-1,28. ఆనాడే వివాహ వ్యవస్థకూడ ఏర్పడింది. ప్రాచీనమూ పవిత్రమూ ఐన ఈ వ్యవస్థను మనం అతిగౌరవంతో చూడాలి.

11. యువతీ యువకులు

1. వివాహమాడబోయే యువతీయువకులు

వివాహం చేసుకోబోయే యువతీ యువకులు తీయని కలలు కంటూంటారు. భావిజీవితాన్ని గురించి గొప్పగా తలంచుకోవడం మంచిదే. కాని మన భావాలు భావిలో సిద్ధించే భార్యనుగాని, భర్తనుగాని యథార్థంగా అర్థంజేసికొనేలా వండాలి. కాని వివాహానికి ముందే యువకుని గూర్చి యువతి, యువతిని గూర్చి యువకుడు, కొన్ని స్పష్టమైన భావాలు ఏర్పరచుకోవాలి.

2. దైవరూపం

యువకునిలాగే యువతికూడ దేవుని ప్రతీబింబం. దేవుని బిడ్డ. అతనితోపాటు ఆమెకూడ ఒకనాడు దేవుని చేరాలి-ఆది 127. ఇక ఆమెలాగే అతడూ దేవుని పోలికగా సృజింపబడ్డాడు. అతడూ దేవుని పత్రుడు. దేవుని చేరి ఆనందించవలసినవాడు. నరునిలోని యీ దేవుని పోలికను మననం జేసికొన్న యువతీ యువకులు ఒకరు విలువను ఒకరు చక్కగా గుర్తిస్తారు.

3. సహాయకురాలు - అధిపతి

ఆమెను నరునికి సహాయకురాలినిగా అనుగ్రహించాడు ప్రభువు - ఆది 2,18. అనగా ఆమె పురుషునికి సహచారిణి. ఆమె లేందే అతడు పరిపూర్ణ మానవుడు కలేడు.