పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుచి వుంటుంది. ఈ రుచికి లొంగి నరులు అన్నం తింటారు. అలా తినడంవల్ల దేహపోషణం జరుగుతుంది. ఈ రీతినే స్త్రీపురుషుల కలయికలోగూడ సుఖం వుంటుంది. ఈ సుఖానికి లొంగి స్త్రీపురుషులు కలసికొంటారు. ఈ కలయికద్వారా సంతానోత్పత్తి జరుగుతుంది. దేహధారణం, సంతానోత్పత్తి భగవంతుడు సంకల్పించిన ఉద్దేశాలు. రుచి, సుఖం అనే గుణాలద్వారా అతడీయాశయాలను సాధిస్తాడు. లేకపోతే రోజుకి మూడుసార్లు ఎవడు అన్నంతింటాడు? యాతనతో కూడిన బిడ్డలను ఎవడు కంటాడు?

ఇక దేవుని సృష్టికార్యంతో సహకరించేవాళ్ళు తల్లిదండ్రులు. తండ్రి వీర్యం తల్లి గర్భంలో ప్రవేశించినపుడు పిండం ఏర్పడుతుంది. ఆ పిండంలోనికి ఆత్మను ప్రవేశపెట్టి మనుష్యప్రాణిని సృజిస్తాడు భగవంతుడు. మనం పాలరాతిని ఈయందే శిల్చి బొమ్మను చెక్కలేడు. అలాగే మనం పిండాన్ని ఈయందే భగవంతుడు నరుని సృజింపలేడు. ఈలా సృష్టితో సహకరించేది భార్యాభర్తల శారీరక సంబంధం. అందుకే దీన్ని ప్రతిసృష్టి అన్నాం.
ఈ కార్యంద్వారా జ్ఞానశరీరం అభివృద్ధిలోకి వస్తుంది. పరిశుద్దాత్మకు నివాసయోగ్యులైన పిల్లలు కలుగుతారు. భూమిపై భగవదారాధకులు విస్తరిల్లుతారు. మోక్షం పరిశుద్దులతో నిండిపోతుంది. ఈలాంటి శారీరకసంబంధం పట్ల మనకు పవిత్రమైన భావాలుండాలి. 

కొన్నిపార్లు శారీరకావరోధాలవల్ల దంపతులకు బిడ్డలు కలుగరు. దీన్నే వంధ్యాత్వం అంటాం. ఈ పరిస్థితిలో దంపతులు పరస్పర ప్రేమనే సంతానంగా భావించాలి. ఇంకా వాళ్లు ఇతరుల బిడ్డలను దత్తు తీసుకోవచ్చు. లేదా ఏదైనా ప్రేషిత సేవకు తమ జీవితాన్ని అంకితం చేసికోవచ్చు. ఈ ప్రక్రియలు బిడ్డలులేని లోటు కొంతవరకు తీరుస్తాయి.

4. వివాహప్రేమ - లైంగికప్రేమ

జంతువుల్లో లైంగిక ప్రక్రియ కేవలం శారీరకమైంది. నైసర్గికంగానే కలిగేది. కాని నరుల్లో అలాకాదు. అది దాంపత్యపేమకు సంబంధించింది. దంపతులు లైంగికక్రియద్వారా తమలో సహజంగావున్నకామాన్నిశాంతింపజేసికొంటారు. లైంగికక్రియ కామాన్నిశాంతింపజేయాలి గాని రెచ్చగొట్టకూడదు. క్రమేణ ఈ లైంగికక్రియే దివ్యప్రేమగా పరిణామం చెందుతుంది. శరీరం ఆత్మ ప్రాబల్యానికి లొంగుతుంది.

లైంగిక క్రియద్వారా ఆలుమగలు పరిపూర్ణంగా ఒకరికొకరు సమర్పించు కొంటారు. దానిద్వారా వారి దాంపత్యజీవితం, వారి ప్రేమ, వారి సంతోషం పరిపూర్ణమౌతాయి. భార్యాభర్తల లైంగికక్రియలో అపవిత్రత ఏమీలేదు. అది అన్నివిధాలా పవిత్రమైంది, పవిత్రపరచేది కూడ. కనుక దాన్నిగూర్చి మనం సిగుపడకూడదు, ఎగతాళిగా మాట్లాడకూడదు.