పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లైంగికానందం భార్యాభర్తలు ఇద్దరూ కలసి పంచుకొనేది. ఇద్దరినీ తృప్తిపరచేది. కనుక లైంగికక్రియలో దంపతులు ఒకరినొకరు సంతోషపెట్టాలి. ఇది నిస్వార్ధప్రేమ. ఒకరినొకరు తమ ఆనందానికి వాడుకోగూడదు. ఇది స్వార్ధప్రేమ. ఎప్పడూ భార్య భర్తనూ, భర్త భార్యనూ సంతృప్తిపరచే ప్రయత్నంలో వుండాలి. ఒకరినొకరు మానుష వ్యక్తినిగా గౌరవించాలి. ఒకరిపట్ల ఒకరికి ఆరాధనభావం వండాలి. శారీరకంగా జూస్తే సతీపతులకు లైంగికానందాన్ని మించిన ఆనందం లేదు. ఈ యానందంలో దంపతులిద్దరూ పాలుపంచుకోవాలి. ఇది దాంపత్య ధర్మం. ఈ విషయంలో తరచుగా పురుషుడు స్త్రీకి ద్రోహం చేస్తూంటాడు. ఆమెను తన కోరికకు బలిచేస్తూంటాడు. ఇది పెద్ద నేరం.

దాంపత్య జీవితంలో లైంగిక వైముఖ్యం, మితిమీరిన భోగవాంఛ రెండూ నేరాలే. కొంతమంది, విశేషంగా స్త్రీలు, లైంగికక్రియను అసహ్యించుకొని దానిపట్ల వైముఖ్యం జూపుతారు. అది జంతుప్రక్రియ అనుకొంటారు. ఇది పొరపాటు. మానవజాతి ఈలోకంలో అవిచ్ఛిన్నంగా కొనసాగిపోవడం కొరకు, స్త్రీపురుషులు కలసి స్నేహంగా జీవించడం కొరకు, భగవంతుడే లింగాన్ని సృజించాడు. కనుక అది చెడ్డదికాదు, పవిత్రమైంది. కనుక స్త్రీపురుషులు నిర్మలమైన ఉద్దేశంతో లైంగిక క్రియలో పాల్గొని ఈ సృష్టిని కొనసాగించడంలో భగవంతునితో సహకరించాలి. భార్యాభర్తలు పరస్పర ప్రేమతో లైంగికక్రియను జరిపితే భగవంతుణ్ణి పూజించినంత పుణ్యం.

మితిమీరిన భోగవాంఛకూడ నిషిద్ధమే. భోగవాంఛ అంటే కామాన్ని తీర్చుకోవడం. జంతువులా కేవలం స్వీయసుఖాన్ని అనుభవించడం. ఇది మానుష వ్యక్తులైన భార్యాభర్తలకు తగదు. వివాహజీవితానికి పనికిరాదు. స్వీయతృప్తికొరకే సుఖాన్ని కోరుకోగూడదు. ఎదుటి వ్యక్తికి ప్రేమను పంచి ఈయడం కొరకు సుఖాన్ని కోరుకోవాలి. కనుక లైంగిక క్రియలో భార్యాభర్తలు, విశేషంగా భర్తలు కేవలం భోగప్రియలు కాగూడదు. శారీరకమైన కలయికద్వారా నైసర్గికమైన లైంగికవాంఛ దివ్యప్రేమగా రూపొందాలి. కనుక స్త్రీపురుషులు ప్రయత్నంజేసి తమ శారీరకమైన కలయికను పవిత్రమైన స్థాయికి తీసికొనిరావాలి.

ఇంకా, ప్రేమ అంటే ఈయడంగాని పుచ్చుకోవడం గాదు. కావున భర్త భార్య విషయంలో ఈమెనుండి యెంత సుఖం పొందుదామా అనికాక, ఈమెను ఏలా సుఖపెడదామా అని ఆలోచిస్తూండాలి. అలాగే భార్యకూడ ఇతన్నుండి ఎంత సుఖాన్ని పొందుదామా అనిగాక, ఇతన్నియేలా సుఖపెడదామా అని ఆలోచిస్తుండాలి. ఇదినిజమైన ప్రేమ. క్రీస్తు ప్రేమను ప్రకాశింపజేసేది శారీరక సంబంధం. కావున ఈ శారీరక సంబంధం మన స్వార్థబుద్ధికీ, కామతృప్తికీగాక, ప్రేమగుణానికి నిదర్శనంగా వుండాలి.