పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిద్దరు వ్యక్తులు కలసి జీవిస్తారు. వారి కలయిక క్రీస్తు తిరుసభల కలయికను పోలివుంటుంది. కనుక పవిత్రమైంది. ఈ కలయిక ద్వారానే ఉత్దానక్రీస్తూ పవిత్రాత్మా వారిని పునీతులను చేస్తారు.

స్త్రీపురుషులమధ్య విడదీయరాని బంధం వుంటుంది. ఇదే వారికి రక్షణ నిస్తుంది. దంపతులు పీఠంముందు ఒకరికొకరు వివాహ సంస్కారాన్ని ఇచ్చుకొంటారని చెప్పాం, దీనిద్వారా వాళ్లు ఒకరి ఆధ్యాత్మిక జీవితానికొకరు పూచీపడతారు. ఒకరినొకరు పవిత్రపరచుకొంటారు. దేవుడే వారిద్దరిని జతపరచి ఒకరిద్వారా ఒకరిని పవిత్రపరుస్తాడు.

కన్యా గురు సన్యా జీవితాలు వివాహజీవితంకంటె ఎక్కువ పవిత్రమైనవే. కాని దాంపత్యజీవితంగూడ దానంతట అది పవిత్రమైందే. దేవుడే ఆ మార్గాన్ని నిర్ణయించాడు కదా? అందరం క్రీస్తు ననుసరించి పునీతులం కావలసిందే. సంసారులు క్రీస్తు తిరుసభల పోలికనుపొంది, వారి పద్ధతిలో వాళ్ళ క్రీస్తు ననుసరించి, పావిత్ర్యాన్ని పొందుతారు.

2. ప్రేమ సమాజం

లోకంలో నిర్మలమైన ప్రేమ ఎక్కడవున్నా అది దేవుని ప్రేమనే సూచిస్తుంది. ప్రేమ వున్నచోట దేవుడుంటాడు. దేవుడు ప్రేమేకదా! క్రీస్తు తిరుసభను రక్షించి ఆ సభతో నిబంధనం చేసికోవడంలో దేవుని ప్రేమ వ్యక్తమైంది. ఇక క్రైస్తవ వివాహం క్రీస్తు తిరుసభల నిబంధనను పోలివుంటుందని చెప్పాం. కనుక దైవప్రేమ వివాహజీవితంలోకి గూడ ప్రవేశించి దాన్ని పునీతం చేస్తుంది. భార్యాభర్తలను ఓ ప్రేమసమాజంగా ఒనగూర్చుతుంది.

దంపతులు వారి పరస్పర ప్రేమద్వారా క్రీస్తుకిచెందిన వాళ్ళవుతారు. క్రీస్తునుండి ఒకరినొకరు వరప్రసాదంగా స్వీకరిస్తారు. ఒకరికొకరు క్రీస్తు వరప్రసాదాన్ని దయచేస్తారు. పరస్పర ప్రేమద్వారా దేవుని ప్రేమను తమలో ప్రతిబింబించుకొంటారు.

క్రైస్తవ వివాహంలో శారీరక ప్రేమా, దివ్యప్రేమా కూడా పరాకాష్ట నందుతాయి. శారీరక ప్రేమద్వారా దంపతులు ఒకరికొకరు పూర్తిగా సమర్పించుకొంటారు. ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలుగుతారు. ఒకరి జీవితంలోని కొకరు చొచ్చుకొనిపోయి ఏకవ్యక్తిగా తయారౌతారు. ఒకరికొకరు విడదీయరాని స్నేహితులౌతారు. దీనిద్వారా వాళ్ళ శరీరమూ మనసూకూడ ఔన్యత్యాన్ని పొందుతాయి.

వివాహ సంస్కారంద్వారా దంపతుల శారీరకప్రేమ క్రమేణ దివ్యప్రేమగా మారిపోతుంది. వాళ్లు ఒకరినొకరు దేవుని బిడ్డనుగా, తిరుసభ సభ్యునిగా గుర్తించి పరస్పరం సేవలు చేసికొంటారు. క్రీస్తునందు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొంటారు. క్రీస్తు ప్రభావం వారిమీద బలంగా సోకుతుంది. ఇద్దరూ సంతానాన్ని అంగీకరించి ప్రేమిస్తారు.