పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పై అతనేష్యస్ మనం దైవ పుత్రులమౌతామని కూడ చెప్పాడు, మంటిమీది వాళ్ళని మింటిమీదికి చేర్చడానికే క్రీస్తు మింటి మీదినుండి మంటిమీదికి దిగివచ్చాడు. మానవకుమారులను దైవకుమారులను గావించడం కోసమే దైవకుమారుడు మానవకుమారుడై జన్మించాడు. తాను మనుష్య కుమారుడన్న పేరుతో చలామణి అయ్యాడు. అతని ద్వారా మనం దైవకుమారులమై పరలోకంలోని దేవుణ్ణి "మా తండ్రీ!” అని పిలుస్తున్నాం.

బానిసల ప్రభువు తనకు బానిసయైన ఆదామునకు బానిసయై జన్మించాడు. దానిద్వారా మృత్యుగ్రస్తులైన ఆదాము పుత్రులు అమృతత్వం పొంది దైవ కుమారులయ్యారు. కావుననే "అతడు వారిని దైవపత్రులను చేసాడు" అని చెప్పబడింది. - యెహా 1,12. అతడు స్యభావసిద్ధంగానే దైవకుమారుడు. మనం అతని వరప్రసాదం ద్వారా దైవ పత్రులం. ప్రభువు కరుణామయుడు కాబట్టి తాను ఆదాము పుత్రుడై జన్మించి మనలనుకూడ తనయందు భరించుకొన్నాడు. దీని వలన మనం దేవుణ్ణి మనయందు భరించుకో గల్లుతున్నాం.

హిలరీ భావాల ప్రకారం క్రీస్తు మన మానుష స్వభావాన్ని చేకొని మనలనందరినీ తనలోనికి తీసికొన్నాడు. తాను ఓ పట్టణంలా వుంటాడు. క్రీస్తుతో ఐక్యమై ఆ దివ్యపట్టణంలో వసించే దివ్యపౌరులం మనం.

క్రీస్తుద్వారా దైవత్వాన్ని పొందినట్లే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుని పొందుతుంటాం. అలెగ్జాండ్రియా సిరిల్భావాల ప్రకారం, క్రీస్తు పితకు ప్రతిబింబమైతే పరిశుద్దాత్మ క్రీస్తుకు ప్రతిబింబం. కావుననే ఈ పావనాత్మక్రీస్తు రూపురేఖలను మన హృదయాల్లో చిత్రిస్తుంది. ఈలా చిత్రించడం ద్వారానే మనం క్రీస్తు దైవత్వంలో పాలు పొందుతూంటాం.

పితృపాదుల భావాలు ఎంత రమ్యంగా వుంటాయో అంత బహుళంగా వుంటాయికూడ. కాని వాని నన్నిటినీ ఇక్కడ పేర్కొనలేం. వాళ్ళ భావాల సారం యిది: క్రీస్తు స్వభావ సిద్ధంగా దైవకుమారుడు. మనం క్రీస్తు కృపవల్ల దైవ కుమారులం. ఈ దైవత్వంపై మనకు ఏ హక్కూలేదు. స్వభావసిద్ధంగా మనం దేవుళ్ళం కాదుగదా, పాపపు నరులం కూడ. మన స్వభావం వేరు. దైవస్వభావంవేరు. ఐనా ప్రభువు మనమీద దయబూని తన దైవత్వంలో మనమూ పాలు పొందేలా చేసాడు.

3. ఉపనిషద్భావాలు

మనం స్వభావ సిద్ధంగా భగవంతులం కాము, క్రీస్తు వరప్రసాదం వలన దివ్యత్వం పొందుతామని చెప్పాం. కాని హిందూ సోదరులు, జనులు స్వభావసిద్ధంగానే భగవంతులు అని చెప్తారు. వరప్రసాదంతో అవసరం లేకుండానే, మనమే భగవంతులం, భగవంతుడే మనం అని వాదిస్తారు. ఈ వాదనకే అద్వ్తమని పేరు.