పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోక్షసాధనకై హిందువులు కర్మ భక్తి, జ్ఞానం అనే మూడు మార్గాలు సూచిస్తారు. ఈ మూడింటిలో జ్ఞానమార్గం మాత్రమే అద్వైతవాదాన్ని అవలంబిస్తుంది. ఈ యద్వైత వాదం తొలుత ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడింది, ఉపనిషత్తులు వేదాల్లో ఓ భాగం. క్రీస్తు పూర్వం 8-4 శతాబ్దాల్లో రచింపబడ్డాయి. ఈ యుపనిషత్తులు మానవుడుకూడా భగవంతుడే అనే అద్వెత వాదాన్ని మాత్రమేకాక, నరుడు భగవంతుడు వేరు వేరు సత్తులనే ద్వెత భావాన్నీ ఈ సత్తులన్నీ భగవంతుని గుణాలను కలిగి వుంటాయనే బహ్వీశ్వర భావాన్నీ కూడ బోధిస్తాయి. కనుక ఉపనిషద్బోధల్లో ఓ పాయ మాత్రమే అద్వైత బోధ. ఇక ఈ యద్వైత సారం యిది : (1) మనం మొదటినుండీ బ్రహ్మలమే. (2) ఐనా మాయ వలన ఈ సత్యాన్ని మరచి ఆ బ్రహ్మ వేరు, మనం వేరు అని బ్రాంతి పడుతూంటాం. (3) జ్ఞానం ద్వారా మనం కూడా బ్రహ్మమేనని తెలిసికొనిన వెంటనే ఆ బ్రహ్మతో ఐక్యమై పోతాం. ఈ మూడంశాలను ఒకింత విపులంగా విచారించి చూద్దాం.

1. ఉపనిషత్తులు భగవంతుని "బ్రహ్మము" అని పిలుస్తాయి. ఈ బ్రహ్మము త్రిమూర్తులలోని "బ్రహ్మ" కాదు. జగదాధారమైన కారణం. బ్రహ్మపుంలింగం, బ్రహ్మము నపుంసక లింగం. ఈ బ్రహ్మము, మానవుడు, భౌతిక ప్రపంచము - ఈ మూడు మూడు ప్రత్యేక సత్తులు కావనియు ఒకే సత్తనియ ఉపనిషత్తుల సిద్ధాంతం. చాందోగ్యోపనిషత్తు ఈ విశ్వమంతా బ్రహ్మయే అంటుంది. “సర్వంఖలు ఇదంబ్రహ్మ-" 8,14,1. బృహదారణ్య కోపనిషత్తు నేనే బ్రహ్మమునని చెపుతుంది. జీవాత్మను పరమాత్మతో ఏకం చేస్తుంది. "అహం బ్రహ్మ అస్మి" - 1, 4,10.

2. మనమందరమూ స్వయంగా బ్రహ్మమే. ఐనా మాయకు జిక్కి ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. ఇక్కడ బంగారపు గనివుంది అని తెలియనివాడు ప్రతిరోజు గనిమీద నడుస్తున్నా అక్కడున్న అమూల్య వస్తువును తెలిసికోలేడు. అలాగే మనమూ ప్రతిదినం బ్రహ్మ జీవితం జీవిస్తున్నా అ బ్రహ్మమును తెలిసికోలేక పోతున్నాం. బ్రహ్మజ్ఞానంద్వారా మాత్రమే నరులు ఈ మాయను దాటగల్లుతున్నారు.

3. బ్రహ్మమును ధ్యానించి బ్రహ్మ స్వభావం తెలిసికోవడంద్వారామనంకూడ బ్రహ్మలమైపోతాం, బ్రహ్మమైపోతామంటే మనమింతకు ముందు కాని నూత్న వ్యక్తిమైపోతామని కాదు. మనం బ్రహ్మమేనని తెలిసికొంటాం, అంతే. ఈ తెలివిడి ద్వారానే బ్రహ్మభావాన్ని పొందుతాం. బ్రహ్మభావం పొందడమంటే ఏదో కావడంగాదు, తెలిసికోవడం మాత్రమే. బృహదారణ్య కోపనిషత్తు నేనే బ్రహ్మను అని తెలిసికొనేవాడు ఈ సర్వమూ ఔతాడు అంటుంది. "ఆహం బ్రహ్మ అస్మీతి స ఇదం సర్వం భవతి" - 1,410. ఈరీతిగా బ్రహ్మముతో ఐక్యమైనంక నేను జగత్తు, భగవంతుడు అనే మూడుసత్తులు ఉండవు. ఈ మూడు ఒకే సత్తుగా పరిగణింపబడతాయి.