పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. గ్రీకు పితృపాదులు

సిరిల్, బాసిల్, గ్రెగొరీ మొదలైన గ్రీకు పితృపాదులు క్రీస్తు ద్వారా మనం దివ్యత్వం పొందుతామని చెప్పారు. వాళ్ళ భావాలను కొన్నిటిని చూద్దాం. క్రీస్తు జననాన్ని గూర్చి వ్రాస్తూ ఇరెనేయస్, మనుష్యుడు దైవకుమారుడు కావడం కోసమే రక్షకుడు మనుష్య కుమారుడై జన్మించాడని చెప్పాడు. అతనేష్యస్ కూడ క్రీస్తు నరుడై నరుని దేవుని గావించాడు అని వ్రాసాడు.

అలెగ్జాండ్రియా సిరిల్ క్రీస్తు దేవదూతల కుటుంబంలో జన్మింపక అబ్రాహాము కుటుంబంలో జన్మించి నరుడుగా మెలగనేల అని ప్రశ్నించుకొని ఈలా జవాబు చెప్పాడు. మన బానిసజాతిలో జన్మించడంవల్ల క్రీస్తుకు కలిగిన లాభమేమీలేదు. మరి లాభమంతా బానిసలమైన మనకే క్రీస్తుద్వారా మనం బానిసానికి తప్పి దైవత్వం పొందుతున్నాం. పేదరికాన్ని జయించి కలిమిని పొందుతున్నాం.

నీస్సా గ్రెగోరీ తలపున, మంచి కాపరియైన క్రీస్తు తప్పిపోయిన గొట్టెను తన భుజాలమీదికి ఎక్కించుకొని తానూ ఆ గొట్టె స్వభావం పొందుతాడు. ఇక్కడ కాపరి దేవుణ్ణి, గొట్టె మానవ సంతతినీ సూచిస్తుంది. క్రీస్తు గొట్టె, కాపరి రెండూకూడ. అతడు గొట్టె దేనికంటే తాను గైకొనిన క్రొత్త స్వభావం వలన. కాపరి ఎందుకంటే తన స్వీయ స్వభావంచేత, ఈ రీతిగా క్రీస్తు మన స్వభావం గైకొనడం చేత మనం క్రీస్తు స్వభావం గైకొంటున్నాం. అనగా భగవంతులమౌతూన్నాం.

నాసియాన్సన్ గ్రెగోరీ తలపున, క్రీస్తు మన రోజువారి పనులను తానూ చేసి వాటిద్వారానే మనకు దైవత్వం ఇస్తాడు. మన నిద్రను ఆశీర్వదించడానికే ప్రభువు తాను నిద్రపోయాడు. మన అలసటను పునీతం చేయడానికే ప్రభువు తానూ అలసట చెందాడు. మన కన్నీటిని పవిపత్రం చేయడానికే ప్రభువు తానూ కన్నీరోడ్చాడు.

ఇంకా ఈ గ్రెగోరీ తన్ను గూర్చి తానే మననం చేసుకొని ఈలా అబ్బురపడ్డాడు. నేను అల్పప్రాణిని మహత్తర ప్రాణినికూడ. మృత్యువువాతబడేవాడిని, అమృతత్వాన్ని పొందేవాడినిగూడ, దేహిని, ఆత్మచే అలంకృతుణ్ణి కూడ. భౌతిక ప్రపంచవాసిని, దైవపరంలో అడుగుపెట్టే వాణ్ణి కూడ. ఏమి వింత? ఈ భాగ్యమంతా క్రీస్తుద్వారానే. నేను క్రీస్తుతో ఐక్యమై క్రీస్తునందు మరణిస్తాను. క్రీస్తుతో భూస్థాపితుడనై అతనితోనే ఉత్తానమౌతాను. క్రీస్తుతో స్వర్గానికి వారసుడ నౌతాను. క్రీస్తు ద్వారా దైవపుత్రుడనౌతాను. దైవత్వం పొందుతాను.

అతనేష్యన్ తలపున, క్రీస్తు మహిమ మనకూ సంక్రమిస్తుంది. క్రీస్తు మనదేహాన్ని గైకొని మన మానుష సంతతితో నివసించడంచే మనం కూడ దేవుని ఆలయాల మౌతాం. కావున దేవాలయాలమైన మనయందు కూడ ప్రభువు ఆరాధ్యుడు. మనలను చూచిన నరులుకూడ "భగవంతుడు వీళ్ళయందున్నాడు" అని భావిస్తుంటారు - 1 కొరి 1425.