పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగస్టీను, అక్వెనాసు మొదలైన దైవశాస్త్రజ్ఞలు పై బైబులు భావాల మీద ఆలోచన సల్పి ఈక్రింది భావాలను వెల్లడించారు. మనుష్యుల్లో దేవుని పోలికా వుంది, త్రీత్వైక సర్వేశ్వరుని పోలికా వుంది.

దేవుని పోలిక మూడు దశల్లో కన్పిస్తుంది. మొదటి దశ సృష్టికి చెందింది. ప్రతి నరుని ఆత్మలోను సృష్టికర్త రూపం వుంటుంది. దీని వలననే అతడు దేవుని తెలిసికొని ప్రేమింప గల్లుతూన్నాడు. జన్మపాపం ద్వారా ఈ రూపం మాసిపోదు. రెండవదశ ఉద్ధరణకు చెందింది. నరుడు ప్రాకృతిక జీవితం నుండి వరప్రసాద జీవితంలో ప్రవేశించి తన ఆత్మలో దేవుని రూపం కలిగించుకుంటాడు. చావైన పాపం చేసిన వెంటనే ఈ పోలిక నశిస్తుంది. మూడవ దశ మహిమకు చెందింది. మోక్షంలో ప్రభుని ముఖాముఖి దర్శించే పనీతుల్లో అతని దివ్యరూపం వెలుగుతూంటుంది. ఈ మూడవ పోలిక ఎప్పటికీ మూసిపోదు, ఈ మూడవ పోలికవలన మనం కూడ దేవునిలాంటి వాళ్ళమౌతాం. అందుకే యోహాను మొదటి జాబు "దేవుడు ప్రత్యక్షమైనప్పడు మనంకూడ అతనిలా ఔతాం, ఉన్నవానిని ఉన్నట్లుగా అతని నిజరూపం చూస్తాం" అని చెప్తుంది - 3,2.

నరులయందు త్రీత్వెక సర్వేశ్వరుని పోలిక కూడ వుంది. నరునిలో ఉనికి, చిత్తశక్తి, బుద్ధిశక్తివుంటాయి. ఉనికి వలన జనుడు ఉండగల్లుతున్నాడు. బుద్ధిశక్తిద్వారా ఆలోచింపగల్లుతున్నాడు. చిత్తశక్తిద్వారా ప్రేమింప గల్లుతున్నాడు.

నరుని ఉనికి పితయైన సర్వేశ్వరునికి పోలికగా వుంటుంది. ముగ్గురు దైవవ్యక్తుల్లోను తొలివ్యక్తి పిత. అతడు అన్ని ప్రాణులకు ఉనికి నిచ్చేవాడు. ఐనా అతని కెవ్వరూ ఉనికి నీయరు. మరి తనంతట, తననుండి తాను ఉండేవాడు. కావున మన యునికి అతని యునికికి ఒక మాదిరి ప్రతిబింబం, ఒక మాదిరి పోలిక.

నరునియందలి బుద్ధిశక్తి రెండవ వ్యక్తియైన సుతుడైన సర్వేశ్వరునికి పోలికగా వుంటుంది. రెండవ దైవవ్యక్తి పిత బుద్ధిశక్తినుండి వెలువడతుంటాడు. కనుకనే అతనికి "వార్త” అని పేరు. అనగా అతడు పిత పలుకూ ఆలోచనమూను. మనలోని ఆలోచనద్వారా ఈ రెండవ దైవవ్యక్తిని పోలివుంటాం.

మనలోని చిత్తశక్తి మూడవ దైవవ్యక్తియైన పరిశుద్దాత్మకు పోలికగా వుంటుంది. చిత్తశక్తి ప్రేమకు ఆధారం కదా! పరిశుద్ధాత్మ కూడ పితసుతుల పరస్పర ప్రేమే. కనుక మనలోని ప్రేమద్వారా పరిశుద్ధాత్మకు పోలికగా వుంటాం.

నరులమైన మనకు దివ్యత్వం లభిస్తుంది. కాని ఈ దివ్యత్వాన్ని పొందే అర్హత మనలో వుండాలి. ఈ యర్హతే మనలోని దేవుని పోలిక. ఈ పోలిక వలననే నరులు పశుపక్ష్యాదులకంటె గొప్పవాళ్లి, దేవుని రూపాన్ని పొంది దైవజీవితం జీవింప గల్లుతున్నారు. రెండవ శతాబ్దపు వేదశాస్త్రజ్ఞడు ఇరెనేయుస్ ‘నరుడు దేవుని మహిమను విస్తరింప జేస్తున్నాడు" అని వ్రాసాడు.