పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. క్రైస్తవుడు క్రీస్తుసందేశంతో నిండుకొని ఉండాలి. కుండ నీటితో నిండివున్నట్లే భక్తుని హృదయం బైబులు సందేశంతో నిండి ఉండాలి. అనగా అతనికి భైబులుతో పరిచయముండాలి - కొలొ 3, 16.

3. ప్రభువు కరువు పంపిస్తాడు. ఆ కరువు కూటికీ నీళ్లకూ గాదు, దైవవాక్యానికి. అనగా ప్రజలు బైబులు వాక్యం తెలిసికోకపోవడం అనే కరువు వస్తుంది. నేటి మన పరిస్థితి అలాగే ఉందిగదా! - ఆమోసు 8, 11.

4. ఎజ్రా ధర్మశాస్త్రగ్రంథాన్ని చదివి విన్నిస్తూండగా యిస్రాయేలు ప్రజలంతా విని భక్తిపారవశ్యంతో కన్నీళ్లు రాల్చారు - నెహమ్యా. 8, 8–9. ఆలాగే ధర్మశాస్త్రం చదువుతూండగా విని యోషియారాజు పరితాపంతో బట్టలు చించుకొన్నాడు -2 రాజు 22,11.

(2) దైవవాక్కులో వుండే శక్తి

1. వానా మంచూ కురిసి నేలను పదునుజేసి పైరు ఎదిగిస్తాయి. సేద్యగానికి ధాన్యం చేకూర్చిపెడతాయి. ఆలాగే దైవవాక్కుగూడ మన హృదయమనే పొలాన్ని పదునుజేసి దానిలో మంచికోరికలు మొలకెత్తిస్తుంది. మనం దైవసంకల్పం ప్రకారం జీవించేలా చేస్తుంది. కురిసిన వర్షంలాగే దైవవాక్కుగూడ వ్యర్థంగాబోదు - యెష55, 10-11.

2. వేటగాడు పక్షులమీదికి విడిచిన డేగలాగే దైవవాక్కుగూడ రౌద్రంగా నరులమీదికి దిగివస్తుంది - యొష 9,8.

3. సమ్మెట గండశిలలను బ్రద్దలు చేసినట్లే ప్రభువు వాక్కునరుని హృదయాన్ని వ్రయ్యలు చేస్తుంది —యిర్మీ 23, 29.

4. దావాగ్ని అరణ్యాన్ని కాల్చివేస్తుంది. అలాగే దేవునిమాట విననివాళ్లను ఆతని వాక్కు భస్మం చేస్తుంది - యిర్మీ 5, 14.

5. ప్రభువు వాక్కుఓ దూతలాగ వడివడిగా పరుగెత్తుకొని వచ్చి నరుని చేరుతుంది - కీర్తన 147, 15.

6. ఆ వాక్కు ఓ యుద్ధవీరుళ్లాగ దుముకుతూ వస్తుంది. అది శత్రువమీదపడి అతన్ని హతమారుస్తుంది - సొలోమోను జ్ఞాన 18, 14-16.

7. ప్రభువు వాక్కు ఓ దీపంలాంటిది మన త్రోవకు ఓ వెలుగులాంటిది - కీర్త 119, 105.

9. ప్రభు పలుకులు ఎంతో రుచిగా ఉంటాయి తేనెకంటె తీయగా ఉంటాయి 119, 103.