పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుండల్లోని నీళ్ళ త్రాగమని చెప్పాడు. అతని కారుణ్యానికి రూతు ఎంతో సంతోషించింది — రూతు, 2, 8–9.

5. పౌలు ఓడపై ప్రయాణం చేస్తుండగా తుఫాను వచ్చి ఆ వోడ మునిగిపోయింది. అతడూ అతని యనుచరులూ ఒడ్డజేరి మాల్టాదీవి చేరుకొన్నారు. ఆ ద్వీపవాసులు పౌలును ఆదరంతో జూచారు. అప్పడు చలిగా వున్నందున మంటలువేసి అతన్ని పరామర్శించారు - అచ 28,చ 1-2.

6. ఓ యజమానునికి ఓ సేవకుడు పెద్దమొత్తం బాకీపడి ఉన్నాడు. యజమానుడు అతనిమీద దయతలచి బాకీని మన్నించాడు. ఆ సేవకుని ఇంకో సేవకుడు చిన్నమొత్తం బాకీపడి ఉన్నాడు. అయినా అతడు తనతోడి సేవకుణ్ణి మన్నించలేదు. బాకీ చెల్లించవా అని అతన్నిచెరలో వేయించాడు. ఆ సంగతి తెలిసికొని యజమానుడు మొదటి సేవకుణ్ణి పిలిపించి "ఓయీ! నేను నీయెడల దయచూపినట్లే నీవూ తోడి సేవకునియెడల దయజూపవద్దా?" అని అతన్ని కఠినంగా శిక్షించాడు- మత్త 18, 83. 28. పని మనకు పనిచేయాలంటే యిష్టంగా ఉండదు. పని నుండి తప్పించుకొంటే యెంతోగొప్ప అనుకొంటాం. కాని బైబులు భగవంతుడు స్వయంగా పనిచేసేవాడు. ఆ భగవంతునిలాగే అతని భక్తుడుకూడ పనిచేయాలి. చివరికి మనలను రక్షించేదీ శిక్షించేదీగూడ మనం చేసే పనే. 1. దేవుడు ఆరునాళ్లు పనిచేసి భూమ్యాకాశాలనూ వాటిలో ఉండే సకల ప్రాణులనూ సృజించాడు. ఏడవనాడు పనిచాలించి విశ్రాంతి తీసికొన్నాడు. ఏడవరోజును దీవించి దాన్ని పవిత్ర దినంగా చేసాడు - ఆది 2, 1-3.

2. ఆదాము పాపంచేయకముందుగూడ ఏదెను తోటలో పని చేస్తూండేవాడు - ఆది 2, 15, అయినా ఆ పని అతనికి కష్టమనిపించలేదు. ఇక ఆదాము పాపంచేసాక నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొమ్మని దేవుడతన్ని శపించాడు. ఈ శాప ఫలితంగా ఆదామునకు పనిభారమనిపించింది. నాటినుండి నేటివరకు నరులందరికీ పని అంటే అనిష్టంగానే ఉంటుంది - ఆది 3, 19.

3. చీమలనుచూచి సోమరియైన నరుడు జ్ఞానం తెచ్చుకోవాలి. చీమలకు నాయకుడూ లేడు, తనిఖీదారుడూ లేడు, అయినా అవి సోమరితనంతో కాలం వెళ్లబుచ్చవు. పంటకాలం రాగానే ఆహారం నిల్వజేసికొంటాయి. ఆ యాహారంతో సంవత్సరమంతా హాయిగా బ్రతుకుతాయి. ఈలాగే నరుడుగూడ కృషిచేస్తే ఆ కృషి ఫలితంగా బ్రతికి పోతాడు - సామె 6, 6-8.