పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. క్రీస్తు తానుచేసిన పనులన్నీ చక్కగాజేసి ముగించాడు. అతడు ఇతరులకు ఉపకారంజేస్తూ పర్యటనం జేసాడు - ఆచ 10,38.

5. మనం చేసేపనులు మంచివైయుండాలి. మంచి పనులు ఓ దీపంలా ప్రకాశిస్తాయి. ఆ వెలుగునుజూచి తోడి జనులు పరలోకంలోని దేవుణ్ణి కొనియాడతారు - మత్త 5,16.

6. మనం చేయవలసిన పనంతాచేసి ముగించాక గూడ గొప్పలు చెప్పకోగూడదు. మేము అది చేసాం. యిది చేసాం అని డప్పవాయించుకోగూడదు. మన బాధ్యత ప్రకారం చేయవలసిన పని చేసినపిదపగూడ "మేము అయోగ్యులమైన సేవకులం. మా కర్తవ్యం ప్రకారం చేయవలసినపని చేసాం. మేము అధికంగా చేసిందే ముంది?" అనుకోవాలి - లూకా 17.10.

7. క్రీస్తు తన తండ్రి చిత్తప్రకారం జీవించాడు. తాను చేసిన పనులన్నీ తండ్రి చిత్తాన్ననుసరించే చేసాడు. అతడు "నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమూ ఆయన పనిని పూర్తిచేయడమూ నా యాహారంగా భావిస్తాను" అని యన్నాడు - యోహా 4,24.

8. మంచిచెట్టు మంచిపండ్లనూ, పాడుచెట్టు పాడుపండ్లనూ కాస్తాయి. పండ్లనుబట్టి చెట్టు ఏలాంటిదో తెలిసిపోతుంది. అలాగే మనంచేసే పనులనుబట్టే మనమేలాంటి వాళ్లమో తెలిసిపోతుంది - మత్త 7, 16, 30.

9. పౌలు బ్రతికివుండగా క్రీస్తు మళ్ళా రెండవ మారు విజయంచేసే కాలం ఆసన్నమైంది అనే వదంతి బయలుదేరింది. ఆ వదంతిని ఆసరాగా దీసికొని కొంతమంది పనిపాటలు మానేసి గాలికి తిరగడం మొదలెట్టారు. తెస్సలోనిక పట్టణంలో ఈలాంటి పోస్కోలు రాయుళ్లు కొంతమంది పౌలు కంటబడ్డారు. అతడు వాళ్ళను నిశితంగా మందలించాడు. "పని చేయనివాడు కూడు దినడానికి అరుడుకాడు" అని శాసించాడు - 2 తెస్స 3,10.

10. పౌలుకు చివరిరోజులు సమీపించాయి. అతడు తన జీవితాన్నంతటినీ ఓమారు సమీక్షించి చూచుకొన్నాడు. తాను వ్యర్థంగా కాలంగడపలేదనీ ప్రభువుకోసం ఏదో కొంత సాధించాననీ సంతృప్తిచెందాడు. ఇంకా అతడు ఈలా అనుకొన్నాడు - "ఇంతకాలమూ నేను మంచి పోరాటమే పోరాడాను. పందెంలో చక్కగా పరుగెత్తాను. ప్రభువమీద విశ్వాసం నిలుపుకొన్నాను. ఇప్పడు నాకు పందెపు బహుమానం లభిస్తుంది. న్యాయాధిపతియైన ప్రభువు నాకు నీతిమంతుల కిరీటాన్ని బహూకరిస్తాడు. ఒక్కనాకేగాదు, ప్రభువు కొరకు పనిచేసి ఆయన దర్శనంకోసం వేచివున్న భక్తులందరికీ ఈలాంటి కిరీటం లభిస్తుంది" -2 తిమో4, 7-8.