పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


29. విశ్వాసం

భగవంతుని మీద భక్తి అంటే ఏమిటి? ఆ ప్రభుని నమ్మి ఆతన్ని ఆశ్రయించడం. కనుక నమ్మికంలేందే దేవుని మీద భక్తి కుదరదు. ప్రస్తుతం మనం భగవంతుణ్ణి కంటితో చూడలేం. కేవలం విశ్వాసం ద్వారానే అతన్ని అంగీకరించాలి. భగవంతుణ్ణి నమ్మినవాళ్లకి ఈ జీవితంలోని సుఖదుఃఖాలద్వారా అతడు రోజురోజుకీ అనుభవానికి వస్తూనే ఉంటాడు. 1. అబ్రాహాము కాల్డియాదేశ నివాసి. ప్రభువు అతన్ని “నీ దేశాన్ని నీ చుట్టపక్కాలనూ వదలి నావెంట రమ్మని పిల్చాడు. ఆబ్రాహాముకి తానెక్కడికి వెళ్ళాలో యేమిచేయాలో ఏమీ తెలియదు. అయినా అతడు ప్రభునినమ్మి అతనివెంట వచ్చేసాడు. ఇది యతని విశ్వాసంలో మొదటి మెట్టు - ఆది 12, 1. ఈ అబ్రాహాముకి సంతానం కలుగలేదు. అతడూ అతని భార్య సారా వృద్దులు. అయినా అతడు ప్రభుని నమ్మాడు. ప్రభువు అబ్రాహాముకి సంతానం కలిగిస్తానని చెప్పాడు. పైగా అతని వంశీయులు ఆకాశంలోని చుక్కల్లాగ, సముద్రతీరమందలి యిసుకరేణువుల్లాగ వృద్ధి చెందుతారని మాటయిచ్చాడు. అబ్రాహాము దేవునిమాట నమ్మాడు. ఆ నమ్మికనుబట్టే దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు. ఇది అతని విశ్వాసంలో రెండవమెట్టు -15, 5-6.

ఆ మీదట ప్రభువు అబ్రాహాముని తన యేకైక కుమారుడైన ఈసాకుని బలియిూయమని కోరాడు. ఆ ముసలి ప్రాయంలో ఈసాకు గతిస్తే అతనికి మరో కుమారుడు పడతాడా? అయినా అతడు దేవుణ్ణినమ్మాడు. తన కుమారుడ్డి ప్రభువు ఏలాగైనా బ్రతికించకపోతాడా అనుకొన్నాడు. అతడు ఈసాకును బలి యిూయడానికి పూనుకొన్నాడు. ప్రభువు మాత్రం ఒక పొట్టేలిని బలిగా స్వీకరించి ఈసాకును వదలివేసాడు. ఇది యతని విశ్వాసంలో మూడవమెట్టు. ఈలా అబ్రాహాము విశ్వాసంతో జీవించిన నీతిమంతుడు - ఆది 22, 11-13. 2. ప్రభువు యిస్రాయేలు ప్రజలకు ఎడారిలో మన్నా కురిపించాడు. అయినా ఆ యాహారం వాళ్ళకు రుచించలేదు. చవీసారమూ లేని ఈ యన్నం ఎవరికి కావాలి అని వాళ్లు మోషేమీద తిరగబడ్డారు. అప్పడు ప్రభువు ప్రజలపై కోపించి నిప్పపాములు పంపాడు. అవి కరవగా వాళ్లల్లో చాలమంది చచ్చారు. అప్పడు ప్రజలు మోషేను ప్రార్ధింపగా అతడు దేవుని యాజ్ఞపై ఓ యిత్తడిపామును చేయించి దాన్ని ఓ యెత్తయిన గడెమీద వ్రేలాడదీయించాడు. పాములు కరచిన వాళ్ళంతా నమ్మికతో ఆయిత్తడి పామువైపు చూడగా విషంవిరిగి బ్రతికిపోయారు. ఒట్టినే యిత్తడిపామువైపు చూడ్డంవల్లకాదు, ఆ పామువైపు చూడమని చెప్పిన దేవుని ఆజ్ఞను నమ్మడంవల్ల వాళ్లకు చావు తప్పింది - సంఖ్యా .21, 8–9.