పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. యోసేపును ఐగుప్తలో పోతీఫరు అనే సైన్యాధిపతికి అమ్మివేసారు. యోసేపు అతని యింట్లో మన్ననపొందాడు, యజమానుని భార్య యోసేపు చక్కదనంజూచి అతని మీద కన్ను వేసింది. అతన్ని తనతో శయనింపమని నిర్బంధం చేసింది. యోసేపు ఆ పాడుపనికి సమ్మతింపక పై బట్టను ఆమె చేతుల్లోనే వదలివేసి పారిపోయాడు. ఆమె మత్సరబుద్ధితో ఆ బట్టనే ఆనవాలుగా చూపి యోసేపు తన్ను నిర్బంధించాడని భర్తకు ఫిర్యాదు చేసింది. దానితో యోసేపును చెరలో త్రోయించారు - ఆది 39, 7-20.

6. సంసోను ఫిలిస్టీయులు యువతియైన డెలీలాను పెండ్లిచేసికొన్నాడు. కాని సంసోనుకు ఫిలిస్టీయులకు మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గునమండేది. వాళ్లు ఆమెకు లంచమిచ్చి అతనికి బలం ఎక్కడుంటుందో తెలిసికొమ్మన్నారు. డెలీలా ఆ వీరుణ్ణి మభ్యపెట్టింది. అతనిబలం తలవెండ్రుకల్లో వుంటుందని తెలిసికొంది. అతడు తలజట్టు కత్తిరించేవాడు కాదు. ఆమె సంసోనును నిద్రపుచ్చి అతని తలవెండ్రుకలను గొరిగించింది. అంతట ఫీలిస్ట్రీయులువచ్చి సంసోనుని బంధించి అతని కండ్లు తీయించారు. అతన్ని బానిసను చేసి వెట్టిచాకిరి చేయించుకొన్నారు - న్యాయా 16: 16-22,

7. దావీదు పొరుగింటి ఆడగూతురు బత్షెబాను చూచి మెహించాడు. ఆమె ఊరియా అనే సైనికుని భార్య ఈ ఊరియాని ఏలాగైనా వదలించుకోవాలని దావీదు తలంపు. అపుడు దావీదు సైన్యాధిపతియైన యోవాబు శత్రువులతో యుద్ధం నడుపుతున్నాడు. రాజు అతని కొక జాబువ్రాసి "పోరు జరిగేప్పడు ఊరియాను మొదటివరుసలో నిలబెట్టి మీరంతా కాస్త వెనుకకు తగ్గండి" అని ఆజ్ఞపంపాడు. సైన్యాధిపతి ఆలాగే చేయగా ఊరియా యుద్ధంలో హతుడయ్యాడు. దావీదు కుట్రనెగ్గింది. అతడు బత్షెబాను భార్యగా స్వీకరించాడు. ఇదంతా తెలిసికొని నాతానుప్రవక్త దావీదును నిశితంగా మందలించాడు. అతడు పశ్చాత్తాపపడ్డాడు - 2 సమూ 11, 14-17.

8. పరిసయులు యూదుల్లో ఓ వర్గంవాళ్ళు వాళ్ళకు క్రీస్తు అంటే గిట్టదు. వాళ్ళు ఏలాగైనా అతన్ని వంచించాలన్న బుద్ధితో " కైసరు చక్రవర్తికి పన్నుచెల్లించడం న్యాయామాకాదా?" అని ప్రశ్నించారు. చెల్లించమంటే యూదులకు కోపం, పద్దంటే రోమను ప్రభుత్వానికి కోపం. కనుక వాళ్ళు క్రీస్తు ఏలా జవాబు చెప్పినా అతన్ని ఇరకాటాన పెట్టవచ్చు గదా అనుకొన్నారు. కాని క్రీస్తమాత్రం వాళ్ళకపటబుద్ధిని గ్రహించి చక్రవర్తికి చెల్లించేవి చక్రవర్తికీ దేవునికీ చెల్లించేవి దేవునికి చెల్లించండనిచెప్పి వాళ్ళ నోళ్ళు మూయించాడు - మార్కు 12, 13-17,

9. పిలాతుకు క్రీస్తు ఏ నేరమూ చేయలేదని బాగా తెలుసు. ఐనా అతడు ప్రజలకు భయపడ్డాడు. ద్రోహియైన బరబాను విడుదలచేయించి నిర్దోషియైన క్రీస్తుకు మరణశిక్ష విధించాడు — లూకా 23, 22-25.