పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తండ్రి క్రీస్తుని దైవరాజ్యాన్ని బోధించడానికి పంపాడు. క్రీస్తు కూడా తన తరపున తాను తిరుసభను దైవరాజ్యబోధకు పంపుతాడు. కనుకనే అతడు శిష్యులతో విూరు లోకం నలుమూలలకు పోయి నరులందరికి సువిశేషాన్ని బోధించండి అని చెప్పాడు - మార్కు 16,15. మిరు పోయి ఎల్లరిని నా శిష్యులనుగా జేయండి. నా పేరిట వారికి జ్ఞానస్నానమీయండి అన్నాడు - మత్త 28,19. తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను అని పల్కాడు - యోహా 20,21. ఈ శిష్యులే ఆదిమ తిరుసభ.

ఇంకా, తండ్రి తనకిచ్చిన అధికారాన్ని క్రీస్తు తిరుసభకిచ్చాడు. కనుకనే అతడు శిష్యులతో మీ మాటలు వినేవాడు నా మాటలు వింటాడు. మీ పలుకులు విననివాడు నా పలుకులు వినడు అని పల్కాడు - లూకా 10,16. నేడు తిరుసభ ముఖ్యమైన పని క్రీస్తు ప్రేషిత సేవను కొనసాగించడమే.

క్రీస్తు ప్రేషిత కార్యాన్ని కొనసాగించే తిరుసభ అతని రక్షణాన్ని అందరికీ అందిస్తుంది. దైవరాజ్యాన్ని ఎల్లెడల నెలకొల్పుతుంది. సువార్త వెలుగును అంతట ప్రసరింపజేసి నరులందరిని, జాతులన్నిటిని, ఏకకుటుంబంగా ఐక్యంజేస్తుంది. ఆర్థిక సాంఘిక విషయాలతో గూడిన లౌకిక రంగాన్నిగూడ సువిశేష ప్రకాశంతో నింపి పునీతం జేస్తుంది.

2. తిరుసభ క్రీస్తు మూడు లక్షణాల్లో పాలుపొందుతుంది

క్రీస్తులాగే తిరుసభకూడ మూడు రంగాల్లో ప్రేషిత సేవ చేస్తుంది. అతడు రాజు, ప్రవక్త, యాజకుడు.

రాజుగా క్రీస్తు కాపరి, నాయకుడు. అతడు ప్రజలను నడిపించాడు. వారి మేలుకోరి వారికి సేవలు చేసాడు. క్రీస్తు కార్యాన్ని కొనసాగించే తిరుసభ కూడ ప్రజలకు నాయకత్వం వహించి వారికి పరిచర్యలు చేస్తుంది, విద్యవైద్యం ఆర్థిక సాంఘికాది అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన నానారంగాల్లో తిరుసభ అందించే సేవలు మనం రోజూ చూస్తూనే వున్నాం.

ప్రవక్తగా క్రీస్తు దైవరాజ్యాన్ని బోధించాడు. తిరుసభకూడ నేడు ఈ బోధన సేవను కొనసాగిస్తుంది. పూజలో జరిగే సువిశేషబోధ, జ్ఞానోపదేశ సేవ, దైవశాస్త్రబోధ, మతగ్రంథ ప్రచురణం మొదలైన నానా రూపాల్లో నేడు బోధన సేవ కొనసాగుతూంది.

యాజకుడుగా క్రీస్తు సిలువపై ఆత్మార్పణం చేసికొని ప్రజలను పవిత్ర పరచాడు. తిరుసభ ముఖ్యంగా దేవ ద్రవ్యానుమానాలద్వారా ఈ పవిత్రీకరణాన్ని కొనసాగిస్తుంది. విశేషంగా క్రీస్తు సిలువబలిని మన మధ్య కొనసాగించడం ద్వారా ప్రజలను పునీతులను చేస్తుంది.