పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తే మొదటి సువిశేష బోధకుడు. క్రీస్తు ఆజ్ఞద్వారా ఆ పరిచర్యను నేడు తిరుసభ కొనసాగిస్తుంది. ఈ సేవలో పైన పేర్కొన్న రాజత్వం ప్రవక్తృత్యం యాజకత్వం అనే మూడు గుణాలు ఇమిడేవన్నాయి. సువిశేష పరిచారం ద్వారా తిరుసభలోకానికి తెలియజేసే ముఖ్యాంశాలు ఇవి. తండ్రి క్రీస్తుద్వారా మనలను ప్రేమించాడు. క్రీస్తుద్వారా మనకు నిత్యజీవం దయచేసాడు. క్రీస్తు ద్వారా మనకు తండ్రి రక్షణమూ వరప్రసాదమూ కృపా లభిస్తాయి.

3 ఆధ్యాత్మిక లౌకిక రంగాల్లో తిరుసభ సేవలు :

తిరుసభ సేవ ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో వుంటుంది. అది ముఖ్యంగా నరులకు దైవరాజ్యాన్ని బోధించేది. ఐనా ఈ నరులు దేహాత్మలతో కూడినవాళ్ళ వారికి ఈలోక జీవితం కూడ ముఖ్యమే. కనుక తిరుసభ కేవలం ఆధ్యాత్మిక రంగాన్ని మాత్రమే పట్టించుకొని లౌకిక రంగాన్ని అనాదరం చేయదు. అందుకే అతి ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో పనిచేసినా, లౌకికరంగాన్ని కూడ విలువతో జూస్తుంది. జాతీయ అంతర్జాతీయ సంఘటనలు, కుటుంబజీవితం, శాంతి, సమాచార సాధనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మానవ హక్కులు మొదలైన నానారంగాల్లో కృషి చేస్తుంది.

ఇటీవల తిరుసభ పేదసాదలకు జరిగే అన్యాయాలను చక్కదిద్దడం అనే రంగంలో ఎక్కువ శ్రద్ధ చూపుతూంది. పేదల విమోచనం కొరకు ఎన్నో పథకాలను రూపొందిస్తుంది. ఇండియాలాంటి పేద దేశాల్లో సాంఘిక అన్యాయాలూ అసమానతలూ ఎన్నయనా వుంటాయి. మనదేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కొరకు తిరుసభ ఎనలేని సేవలు చేస్తుంది. ఈ సభ పరిచర్యల ద్వారా దళిత వర్గాల ప్రజలు ఎంతో అభివృద్ధిలోకి వచ్చారు.

తిరుసభ అహింసా మార్గాన్ని వ్యక్తి స్వేచ్చను, మత స్వేచ్చను సమర్ధిస్తుంది.

ప్రార్ధనా భావాలు

1. తిరుసభలో మఠవాసినులైన కన్యలు ఓ ముఖ్యభాగం. ఐదవ శతాబ్దంలో జీవించిన సిప్రియన్ భక్తుడు వీరినిగూర్చి ఈలా నుడివాడు. "కన్యలు తిరుసభ అనే చెట్టు విూద పూచిన పూవుల్లాంటివాళ్లు, వరప్రసాదంతో అలంకృతమైనవాళ్ళు భగవంతునికి ప్రతిబింబాలుగాను ఆ ప్రభువు పావిత్ర్యానికి చిహ్నాలుగాను నిల్చేవాళ్లు, వీళ్లు క్రీస్తు మందలో అతి శ్రేష్టమైన భాగం. తల్లియైన తిరుసభ తన పత్రికలైన వీరినిజూచి ఆనందిస్తుంది". ఈ మఠకన్యలు తమ అంతస్తుకి తగినట్లుగా భక్తి శ్రద్ధలతో జీవించాలని ప్రార్థిద్దాం.