పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరుసభ ఉత్సాహంతో సకలజాతి జనులకూ క్రీస్తుని బోధించాలి. ఈ యన్యజాతుల మతాల్లోని మంచి సూత్రాలను తానూ గ్రహించాలి. సత్యమంతా తిరుసభలోనే లేదు. ఇతర మతాల్లో కూడ వుంది. ఇంకా, తిరుసభ ప్రపంచంలోని నానా జాతుల్లోను వారి సంస్కృతుల్లోను వేరు బాతుకోవాలి. ఈ దేశ క్రైస్తవులు ఈ దేశ సంస్కృతిని ఆదరించాలి అనడానికి ఇది ముఖ్యకారణం. పైగా తిరుసభ అన్యమతాలతో సంప్రతింపులు ప్రారంభించి వాటిలోని సత్యాలను గ్రహించడానికి సిద్ధంగా వుండాలి. పెక్కు మతాలతో కూడిన మనదేశంలో ఈ సూత్రాల ప్రాముఖ్యం అంతాయింతా కాదు.

ప్రార్థనా భావాలు

1. ప్రాచీన వేదశాస్తులు తిరుసభను నోవా నిర్మించిన ఓడతో పోల్చారు - ఆది 8. ఆ వోడ నెక్కిన వాళ్ళంతా బ్రతికారు. తతిమ్మా వాళ్ళంతా జలప్రళయంవల్ల నాశమయ్యారు. అదే విధంగా తిరుసభలో చేరిన వాళ్ళకు రక్షణం వుంటుంది. తతిమ్మా వాళ్లు నాశమైపోతారు.

2. క్రీస్తు సేవకుడు - మార్కు 10,45. అతడు స్థాపించిన తిరుసభ కూడ సేవకురాలు కాని యజమానురాలు కాదు. తిరుసభలో అధికారమూ నాయకత్వమూ వున్నాయి. కాని ఇవి రెండూ సేవలు చేయడానికే గాని పెత్తనం చలాయించడానికి కాదు. బిషప్పలూ గురువులూ కన్యలూ ప్రధానంగా సేవలు చేయడానికే వున్నారు. తిరుసభలో అందరూ అందరికీ సేవలు చేయాలి. సేవక తిరుసభ ప్రజలను మెప్పిస్తుంది, ఆకర్షిస్తుంది. మదర్ తెరీసా లాంటి మాన్యులు ఈ రంగంలో మనకు ఆదర్శంగా వుంటారు.

5. తిరుసభ ప్రేషిత సేవ

క్రీస్తు ప్రధానంగా ప్రేషితుడు (పంపబడినవాడు). అతడు నెలకొల్పిన తిరుసభకూడ ప్రేషిత సమాజం. క్రీస్తు ప్రేషిత సేవను కొనసాగింపమని ఆత్మ నిరంతరమూ తిరుసభను ప్రేరేపిస్తూంటుంది. ఈ యధ్యాయంలో తిరుసభ ప్రేషితసేవను పరిశీలిద్దాం. ఇక్కడ మూడంశాలు చూద్దాం.

1. క్రీస్తే తిరుసభను పంపుతాడు

క్రీస్తు ప్రేషితసేవను రకరకాలుగా వర్ణించవచ్చు. అతడు దైవరాజ్యాన్ని నెలకొల్పేవాడు. నరులను దేవునితో రాజీపరచేవాడు. పేదలకు సువార్తను బోధించేవాడు. పాపులను శిక్షించడానికిగాక రక్షించడానికి వచ్చినవాడు. సేవలు చేయించుకోవడానికీ కాక చేయడానికి వచ్చినవాడు. తిరుసభకూడ క్రీస్తులాగే రకరకాల ప్రేషిత సేవలకు పూనుకొంటుంది. అది క్రీస్తుని నేడు మన మధ్యలో కొనసాగించేది.