పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తండ్రికి ప్రార్ధన చేయాలన్నాడు — మత్త 6,10, 6. అతడు బోధించిన సామెతలుకూడ దైవరాజ్యం తప్పక వ్యాప్తి చెందుతుందనే చెప్తాయి. ఆవగింజ చిన్నది. దానినుండి పెద్దచెట్టు పెరుగుతుంది. పులిసినపిండి పొంగి ఉబ్బతుంది. రైతు చల్లే విత్తనాలు నూరంతలుగా ఫలిస్తాయి - మత్త 13. సేద్యగాడు విత్తనాలు చల్లగా క్రమేణ పైరు ఎదిగి పంట పండుతుంది - మార్కు 8,26–9. ఇవన్నీ దైవరాజ్యవ్యాప్తిని సూచించేవే. దైవకృపవల్లనే దైవరాజ్యం వ్యాప్తిచెంది, విజయాన్ని సాధిస్తుంది.

5. రక్షణ వార్తవిని నరులు సంతోషించాలి

నిధిని కనుగొన్నవాడూ, విలువగల రత్నాన్నిసంపాదించినవాడూ సంతోషించారు. ఈ నిధీ రత్నమూ దైవరాజ్యాన్ని సూచిస్తాయి. వాటిని సంపాదించినవాళ్ళు సంతసిస్తారు - మత్త 13,44-46. క్రీస్తుకి త్రోవను సిద్ధంజేసిన స్నాప్రక యోహాను తల్లి కడుపులో వున్నపుడే మెస్సియా రాకడను గాంచి ఆనందంతో ఎగిరి గంతేసాడు - లూకా 1,44 అటుతర్వాత అతడు పెండ్లికుమారుని స్వరాన్నివిని సంతోషించాడు - యోహా 3,29. అనగా యోహాను క్రీస్తనీ క్రీస్తురాజ్యాన్నీ చూచి ఆనందించాడు. దైవరాజ్యం నూత్న శకాన్ని కొనివస్తుంది. దేవుని కరుణనీ పాపపరిహారాన్నీ తీసికొనివస్తుంది. దైవరాజ్యమంటే దైవపరిపాలనం ప్రారంభం కావడం. కనుక ఆ రాజ్యంలో చేరేవాళ్ళంతా సంతోషిస్తారు.

పైన దైవరాజ్యాన్ని గూర్చిన పూర్వవేదబోధలూ, పూర్వవేదాంత కాలంలోని యూదుల భావాలూ, క్రీస్తు బోధలు కూడ పరిశీలించాం, కడన ఒక్కప్రశ్న ఈ దైవరాజ్యం ఎప్పడు వస్తుంది? కొందరు ఆధునిక వేదపండితులు అది లోకాంతంలోగాని రాదన్నారు. మరికొందరు అది పూర్తిగా రానేవచ్చింది అన్నారు. కాని ఈ రెండు భావాలు సరైనవిగావు. పై ప్రశ్నకు తృప్తికరమైన జవాబు ఇది. దైవరాజ్యం క్రీస్తుతోనే పాక్షికంగా వచ్చింది. లోకాంతంలో పరిపూర్ణంగా వస్తుంది. తిరుసభ ఈ మధ్యకాలంలోవుంది. కనుక ఇప్పడు మనం ఇదివరకే కొంతవరకు వచ్చిన, లోకాంతంలో పరిపూర్ణంగా రానున్న దైవరాజ్యాన్ని చూస్తున్నాం. ఆ వచ్చిన దానికీ రానున్న దానికీ గూడ క్రీస్తేపునాది. అతడే దైవరాజ్యం.

క్రీస్తు మరణోత్థానలతోనే దైవరాజ్య స్థాపనం జరిగింది. అతని బోధలూ అద్భుతాలూ అతడు దయచేసిన పాపపరిహారమూ దాని స్థాపనాన్ని తెలియజేస్తాయి. కాని మానుష క్రీస్తులాగే దైవరాజ్యంకూడ ఈ లోకంలో గుప్తంగా, దైన్యంగా వుంటుంది. ప్రజలు దాన్ని అట్టేగుర్తించరు. ఉత్తానానంతరం క్రీస్తుకి గుర్తింపూ మహిమా వచ్చినట్లే లోకాంతంలోగాని దైవరాజ్యానికి మహిమరాదు. అప్పుడుగాని అది పరిపూర్ణ విజయాన్ని సాధించదు.