పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పారు - యెష 35,5-6. రాబోయేవాడివి నీవేనా అని స్నాపక యోహాను శిష్యులు క్రీస్తుని అడిగారు. అనగా నూత్నయుగాన్ని ప్రారంభించేవాడివి నీవేనా అని వాళ్ళ భావం - మత్త 11,8. క్రీస్తు వాళ్లకు తన అద్భుతాలను గూర్చి చెప్పి రక్షణాన్ని ప్రసాదించే నూత్నయుగం వచ్చిందని తెలియజేసాడు.

క్రీస్తుతో నూత్నయుగం ప్రారంభమైందనడానికి కానావూరి వివాహం చక్కని తార్కాణం. ప్రభువు ఇక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. యూదుల భావాల ప్రకారం ద్రాక్షరసం నూత్న శకాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు జల ప్రళయానంతరం నోవా ద్రాక్షలు నాటి క్రొత్త శకాన్ని ప్రారంభించాడు - ఆది 9,20. కనుక కానావూరి అద్భుతంలోని ద్రాక్షరసం క్రొత్త శకానికీ, క్రొత్త జీవితానికీ చిహ్నంగా వుంటుంది. ఇంకా క్రీస్తు కొత్త ద్రాక్షరసపు తిత్తులనూ క్రొత్త బట్టలనూ పేర్కొన్నాడు - మత్త 9,16–17. ఇవికూడ రక్షణంతో కూడిన నూత్నయుగానికి చిహ్నాలే.

3. దైవ రాజ్యానికి ముఖ్యమైన గుర్తు దేవుని కరుణే

దైవ రాజ్యానికి ముఖ్యమైన గుర్తు దేవుని కరుణ. అతడు మెస్సియా ద్వారా ప్రజలమిూద దయజూపి వాళ్ల పాపాలను మన్నిస్తాడు. పరిసయులు దేవుడు పాపాత్ములను శిక్షిస్తాడని బోధించారు. దీనికి భిన్నంగా క్రీస్తు దేవుడు పాపులను మన్నించి వారికి రక్షణాన్ని దయచేస్తాడని ప్రకటించాడు. అతడు నేను పిలువవచ్చింది పాపులను గాని పుణ్యాత్ములను కాదన్నాడు. వైద్యుడు రోగులకొరకు అన్నాడు – మత్త 9,12-13. ఆ ప్రభువు మత్తయిని సుంకాల శాలనుండి పిలవడం, జక్కయ్య తప్పలను వ్యభిచారిణి పాపాలను మన్నించడం మొదలైన కరుణ కార్యాలన్నీ అతడు కొనివచ్చిన పాపపరిహారానికి చిహ్నాలే. క్రీస్తు చెప్పిన గొప్ప సామెతలు తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణెం అనేవి — లూకా 15, ఇవికూడ దేవుడు పాపులపట్ల కరుణ జూపుతాడు అనడానికి నిదర్శనాలే. దేవుడే పాపులను వెదుకుకొంటూ వచ్చి వారిని రక్షిస్తాడని ఈ కథల భావం. ఈ విధంగా అంత్య కాలంలో దేవుడు పాపులపట్ల అపారమైన కరుణ జూపుతాడని క్రీస్తు తెలియజేసాడు.

4. దైవరాజ్యం తప్పక వ్యాప్తిజెందుతుంది

దైవరాజ్యవ్యాప్తి నరుల శక్తిపైగాక దేవుని శక్తిపై ఆధారపడి వుంటుంది. దేవుని బలానికి అడ్డలేదుకనుక ఆ రాజ్యం తప్పక వ్యాప్తి జెందుతుంది. కనుకనే క్రీస్తు "నీ రాజ్యం వచ్చునుగాక, నీచిత్తం పరలోక భూలోకాల్లోను నెరవేరును గాక" అని మనం