పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుని నమ్మేవాళ్ళంతా ఇప్పడే దైవరాజ్యంలో ప్రవేశిస్తారు. లోకాంతంలో ఆరాజ్యంలో పరిపూర్ణంగా సుఖిస్తారు. ఈలోక జీవితంలో శోధనలూ పాపమూ అడ్డువస్తుంటాయి. కనుక ఎవరూ ఇక్కడ పరిపూర్ణంగా దైవరాజ్యసభ్యులు కాలేరు. పరిపూర్ణత అనేది పరలోకంలోగాని సిద్ధించదు.

ప్రార్ధనా భావాలు

1. ఆదికాండం 27లో యాకోబు యేసావులకథ వస్తుంది. అక్కడ పెద్దకొడుకైన యేసావుకి రావలసిన తండ్రి దీవెనను చిన్నకొడుకైన యాకోబు దక్కించుకొన్నాడు. యూదసమాజం ఏసావుకీ, తిరుసభ యాకోబుకీ చిహ్నంగా వుంటాయి. యూదసమాజం దేవునికి ప్రథమ పుత్రుని లాంటిది. ఐనా క్రీస్తుని నిరాకరించడం వల్ల ఆ సమాజం తన దీవెనను పోగొట్టుకొంది. తిరుసభ ఆ దీవెనను సంపాదించుకొంది.
2. దైవరాజ్యమే తిరుసభ, కాని కొందరు తిరుసభలో చేరకుండానే దేవుని చేరుకోవచ్చునంటారు. మాకు క్రీస్తు చాలు. తిరుసభ అక్కరలేదు అంటారు. కాని ఇది పొరపాటు. మూడవ శతాబ్దంలో జీవించిన సిప్రియన్ భక్తుడు "తిరుసభను తల్లిగా స్వీకరించనివాడు దేవుణ్ణి తండ్రిగా స్వీకరించలేడు” అని వ్రాసాడు. నరులు తల్లిపట్ల చూపే ప్రేమాభిమానాలను మనం తిరుసభపట్ల చూపాలి.

2. తిరుసభ స్థాపనం

పూర్వాధ్యాయంలో దైవరాజ్యమంటే యేమిటో చూచాం. క్రీస్తు దైవరాజ్యాన్ని స్థాపించడానికే వచ్చాడు. ఈ దైవరాజ్య స్థాపనమే తిరుసభ స్థాపనకు దారితీసింది. క్రీస్తు కోరిక ప్రకారమే తిరుసభ పుట్టింది. అంతేగాని అతడు అనుకోని విధంగా అది ఆవిర్భవించలేదు. కాని అతడు తన జీవితకాలంలో, అనగా తన మరణోత్తానాలకు ముందే, ஒலி స్వయంగా తిరుసభను స్థాపించలేదు. అతని ఉత్తానానంతరం ఆత్మ దిగివచ్చాక కాని అది పుట్టలేదు. ఐనా క్రీస్తు జీవించి వుండగానే తన బోధలద్వారా నైతేనేమి, కొన్ని ప్రత్యేక క్రియలద్వారా నైతేనేమి, భవిష్యత్తులో తిరుసభ పడుతుందని సూచించాడు. అనగా తిరుసభ పుట్టాలని క్రీస్తు తన మరణానికి ముందే సంకల్పించుకొన్నాడు. అతని వుత్తానానంతరం అది రూపుతాల్చింది. పాపపరిహారాత్మకమైన అతని మరణమూ, వరప్రసాద సహితమైన అతని వుత్తానమూ తిరుసభకు పునాదులయ్యాయి.