పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తు దైవరాజ్యాన్ని మాత్రమే ఉద్దేశించాడనీ, అతని వద్దేశానికి భిన్నంగా తర్వాత పౌలు తిరుసభను ఏర్పాటు చేశాడనీ, కొందరు ప్రోటస్టెంటు పండితులు వ్రాసారు. ఈ భావం తప్ప, క్రీస్తే తిరుసభ పుట్టుకను కోరాడు.

ఈ యధ్యాయంలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో క్రీస్తు వుత్తానానికి ముందటి తిరుసభను చూస్తాం. ఇక్కడ నాల్గంశాలున్నాయి. రెండో భాగంలో క్రీస్తు ఉత్థానం తర్వాతి తిరుసభను చూస్తాం. ఇక్కడ ఆరంశాలున్నాయి.

మొదటి భాగం

1. యూదులు క్రీస్తుని నిరాకరించడం

యూదులు క్రీస్తుని నిరాకరించినప్పటి నుండి అతడు తిరుసభ పుట్టుకకోసం కృషిచేస్తూ వచ్చాడు. అతడు గలిలయలో బోధిస్తుండగా యూదులు అతన్ని నిరాకరించడం మొదలెట్టారు. విశేషంగా అతడు రెండవసారి రొట్టెలనూ చేపలనూ పెంచి వేలకొలది ప్రజలకు ఆహారం పెట్టినపుడు ఈ నిరాకరణం ఎదురైంది. యోహా 6,60-69 ఈ సంగతిని తెలియజేస్తుంది. ఇక్కడ యూదులు క్రీస్తుని అనుసరించడం మానివేసారు - 6,66. ఇంకా, మత్తయి 16,13-16 కూడ ఈ విషయాన్ని పేర్కొంటుంది. ఇక్కడ క్రీస్తు నరులు తన్నెవరినిగా భావిస్తున్నారని పేత్రుని అడిగాడు. పేత్రు జవాబుని బట్టి ప్రజలు అతన్ని అద్భుతాలు చేసేవాడ్డిగానో లేక ఎవరో వొక ప్రవక్తనుగానో భావిస్తూ వచ్చారు. అంతేగాని అతన్ని మెస్సీయానుగా మాత్రం అంగీకరించడంలేదు.

యూదులు తన్నుమెస్సీయానుగా అంగీకరించడంలేదని రూఢిగా తెలిసాక క్రీస్తు తన మరణోత్తానాలను గూర్చి మాట్లాడ్డం మొదలెట్టాడు - మత్త 16,21. యెరూషలేములో సంభవింపబోయే క్రీస్తు మరణికోత్తానాల ద్వారాగాని తండ్రి సంకల్పించిన దైవరాజ్యం రాదు. అదే తిరుసభకూడ. అతడు యెషయా పేర్కొన్న బాధామయ సేవకుళ్లాగ అనేకుల కొరకు తన ప్రాణాలను ధారపోస్తాడు - 53. క్రీస్తు యెరూషలేములో చనిపోవడం దైవచిత్తం. మరణానంతరం తండ్రే అతనికి మహిమను దయచేస్తాడు.

యూదులు తన్ను నిరాకరించాక క్రీస్తు ఒంటరిగాడయ్యాడు. అనుచరులు లేని మెస్సీయా ఐపోయాడు. యూదులు తన్ను విడనాడారు. వారికి బదులుగా అతడు నూత్న సమాజాన్ని తయారుచేసికోవాలి. ప్రాత యిప్రాయేలుకి బదులుగా నూత్న యిప్రాయేలు ఉద్భవించాలి. ఈ నూత్న యిస్రాయేలే తర్వాత తిరుసభ ఔతుంది. తండ్రి ఆ ప్రాత సమాజాన్ని వదలివేసి ఈ క్రొత్త సమాజం ద్వారా తన రక్షణ కార్యాన్ని కొనసాగించుకొని పోతాడు. ఈ విధంగా తీరుసభ రక్షణ నిర్వాహక సమాజమౌతుంది.