పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మన జీవితం క్రీస్తుద్వారా దేవునియందు ఇమిడి వుంది" అన్నాడు పౌలు - కొలో 3,3. నరుని కేంద్రం అతనిలో లేదు, దేవునిలో వుంది. దేవునిలో నెలకొనివుండడం అతనికి పరమావధి. పూజలో ఆత్మార్పణం చేసికోవడం ద్వారా క్రీస్తులోను అతని తండ్రిలోను నెలకొంది.

ప్రార్ధనాంశాలు

1. క్రీస్తు ఒకే ఒక్కసారి ఏకైక బలిని అర్పించాడు. ఈ భావాన్నే హెబ్రేయుల జాబు మూడుసార్లు పునరుద్దాటించింది - 727, 9, 12, 10,10, కనుక అతడు మళ్లామల్లా క్రొత్తబలిని అర్పించడు. అతని యేకైకబలి నరులందరినీ శాశ్వతంగా రక్షించింది. అలాంటప్పడు మన పూజబలి యెందుకా అని అనుమానం కలుగుతుంది. కాని పూజబలికూడ అవసరమే. ఏకైక బలియైన కల్వరిబలి ఫలితాన్ని మనం పొందాలి అంటే ఈ పూజబలి అత్యవసరం. దాని వరప్రసాద జలాలు దీనిద్వారాగాని మన హృదయాల్లోకి ప్రవహించవు. అందువల్ల మనం ప్రోటస్టెంటు నాయకుల్లాగపూజబలి అనవసరం అని చెప్పకూడదు. అత్యవసరం అని చెప్పాలి. పూజబలి కల్వరిబలిని అవమానిస్తుంది అనకూడదు. దాన్ని సంస్కార రూపంలో మనమధ్య కొనసాగిస్తుంది అనాలి.

2. "పూజబలిలో క్రీస్తుని భుజిస్తాం. మన హృదయం వరప్రసాదంతో నిండిపోతుంది. ఈ దివ్యసత్రసాద స్వీకారం భవిష్యత్తులో మనం పొందబోయే మోక్షభాగ్యానికి సంచకరువుగా గూడ వుంటుంది" అని చెప్తుంది ఓ ప్రాచీన క్రైస్తవ గీతం. పూజబలిలో యోగ్యంగా పాల్గొన్నందువల్ల పై మూడు లాభాలు సిద్ధిస్తాయి.

3. పూజఫలితం మన రోజువారి జీవితంలో కన్పించాలి. పూజలో పాల్గొన్న భక్తుడు రోజువారి జీవితంలో క్రీస్తుకి సాక్ష్యంగా వుండాలి. అతడు మంచి జీవితం జీవించాలి. అనగా క్రీస్తు బోధలను తన జీవితంలో పాటించాలి. ఈ నిష్టద్వారా అతడు ఇతరులకుగూడ ప్రేరణగా వుండాలి. అతడు కొండమీది నగరంలాగ, దీపస్తంభం మీది దీపంలాగ, భోజనంలోని ఉప్పలాగ వుండాలి - మత్త 5,1316. ఈలా క్రీస్తుకి సాక్ష్యంగావుండే శక్తిని ప్రభువు ఆత్మే మనకు ప్రసాదిస్తుంది.