పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


5. శ్రీసభ సమర్పణం

"శిరసైన క్రీస్తు దేహం శ్రీసభ. కనుక క్రీస్తుద్వారా శ్రీసభకూడ తన్ను తాను అర్పించుకొంటుంది". - అగస్టీను భక్తుడు

క్రీస్తు సిలువబలి నేడు శ్రీసభలో సాక్షాత్కరిస్తుంది. ఈ బలిలో శ్రీసభ క్రీస్తుతోపాటు తన్నుతాను తండ్రికి అర్పించుకొంటుంది. కనుక మనం పూజబలిలో శ్రీసభపాత్ర యేమిటో చక్కగా అర్థంచేసికోవాలి. ఇక్కడ ఆరంశాలు విచారిద్దాం.

1. సామూహిక ఆరాధనం

పూర్వవేదంలో మొదట గృహస్థులే బలినర్పించేవాళ్లు, పాస్క బలిని కుటుంబంలోని తండ్రి సమర్పించేవాడు. యిప్రాయేలీయులంతా ఈ బలినర్పించాలి - నిర్గ 12, 47. కనుక ఈ బలిలో సామూహిక గుణముండేది. యూదులు దేవుని సన్నిధిలో పండ్రెండు రొట్టెలు పెట్టేవాళ్ళు ఈ పండ్రెండు రొట్టెలు పండ్రెండు తెగల యిస్రాయేలీయులను సూచించేవి. ఈ రొట్టెలనుచూచి దేవుడు పండ్రెండు గోత్రాలను స్మరించుకొనేవాడు. కనుక ఇక్కడకూడ సామూహిక లక్షణం వుంది.

కాలక్రమేణ యూదమతంలో యాజకుల ప్రాబల్యం పెరిగిపోయింది. గృహస్థలకు మారుగా యూజకులు బలినర్పించడం మొదలెట్టారు. కాని ఈ దశలోకూడ బలిపశువును వధించేది గృహస్తులే. యాజకులు దాని నెత్తుటిని మాత్రం పీఠంమీద చిలకరించేవాళ్ళు ప్రజలు స్వయంగా బలినర్పించక పోయినా యాజకులు తామర్పించే బలిని ప్రజలకోసం అర్పించేవాళ్ళు

బాబిలోను ప్రవాసానంతరం ప్రాయశ్చిత్తబలి బాగా ప్రచారంలోకి వచ్చింది. ప్రజలు పాపులు అనే భావం బాగా బలపడిపోయింది. ప్రజల పాపం దేవుణ్ణి మాత్రమే గాక సమాజాన్నిగూడ బాధిస్తుంది అనుకొన్నారు. కనుక సమాజం పాపాల పరిహారంకోసం ప్రాయశ్చిత్త బలిని అర్పించాలనుకొన్నారు.

ఈ విధంగా యిప్రాయేలు ఆరాధనం ప్రతి దశలోను వ్యక్తిగతమైందిగాగాక సామూహికమైందిగా ప్రచారంలోకి వచ్చింది. ఆ ప్రజలు మొదటినుండీ ఒక సమాజంగా ఉద్భవించారు. దేవుడు ఆ జాతినంతటినీ ఎన్నుకొన్నాడు. కనుక వాళ్ల బలీ ఆరాధనమూగూడ మొదటినుండీ సామాజికమైందే.

ఇక నూత్నవేద ఆరాధనం గూడ సామాజికమైందే క్రీస్తు యాజకుడు. ఆ క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ ప్రజలంతా అతని యాజకత్వంలో పాలు