పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. యిప్రాయేలు ప్రజల ఆరాధనలో కన్పించే ముఖ్యాంశాలు ప్రభువుసృస్టి, అతని రక్షణం. ఇక్కడ భక్తుడు భూమ్యాకాశాలను చేసిన సృష్టికర్తయైన దేవుణ్ణి తలంచుకొంటున్నాడు. ఆ సృష్టికర్త తాను స్వయంగా చేసిన సృష్టి ప్రాణినైన నన్ను తప్పకకాపాడతాడని అతని భావం. సృష్టి ఒకనాటితో ముగిసేదికాదు. నిరంతరం కొనసాగిపోయేది. కనుక ప్రభువు తన భక్తుణ్ణి నిరంతరం ఆదుకొంటాడని అర్థం.

3. ఈ మూడవ చరణంనుండి కీర్తనకారుడు తననుతానే హెచ్చరించు కొంటున్నాడు. "కాపాడువాడు" అంటే గొర్రెలకాపరి. మనలను సృజించిన దేవుడు సజీవుడు. కాపరి గొర్రెలనులా అతడు మనలను ఎల్లవేళలా ఆదుకొంటాడు. అతడు నిద్రపోయేవాడూ ప్రమత్తుడూ కాదు, అప్రమత్తుడు.

4. ఈ చరణంలో ప్రభుని గొర్రెల కాపరితోపాటు కావలి కాసేవానితోగూడ పోలుస్తున్నాడు. యిప్రాయేలుకు కావలికాసి సేవలుచేసే ప్రభువు నిద్రపోయేవాడూ, కునికిపాట్లు పడేవాడూ కాదు. కావలికాసే నరులైనా కునికిపాట్ల పడి ప్రమత్తులౌతారు కాని, దేవుడు ప్రమతుడుకాడు. అతడు నిత్యము మేల్కొనిఉండి తనప్రజలను సామూహికంగానూ వ్యక్తిగతంగానుగూడ కాపాడతాడు.

5. ప్రభువు కీర్తనకారుణ్ణి యుద్ధ ప్రమాదాలనుండిగూడ కాపాడతాడు. తల్లిపక్షిలా రెక్కలు విప్పి అతనికి నీడగా ఉంటాడు. యుద్ధంలోగాని న్యాయస్థానంలోగాని ఓవ్యక్తికి సహాయం చేసేవాడు అతనికి కుడిప్రక్కన నిలబడేవాడు (కీర్త 16,8, 109,31). ఇక్కడ ప్రభువు ఓ యుద్ధవీరుల్లా వచ్చి కీర్తనకారుని కుడిప్రక్కన నిల్చి రణాపాయం నుండీ మృత్యువునుండీ అతన్ని కాపాడతాడని భావం. •

6. ప్రభువు అతన్ని వ్యాధులనుండీ అంటురోగాల నుండీ కూడ రక్షిస్తాడు. మధ్యాహ్నపు సూర్యునివలనా, చంద్రుని వలనా రోగాలు సోకుతాయని పూర్వులు నమ్మారు,

7. సమస్తాపదలనుండీ ప్రభువు అతన్ని కాపాడతాడు.

8. హీబ్రూ ప్రజలు ఈ జీవితాన్ని రాకపోకలుగా, యాత్రగా, ప్రయాణంగా భావించారు. (కీర్త 91,11) కనుక ప్రభువు భక్తుణ్ణి అతని జీవితయాత్ర ముగిసిందాక సంరక్షిస్తాడని భావం. దేవుడు అతన్ని సురక్షితంగా యెరూషలేముకు తీసికొని వెళ్ళి మళ్ళా భద్రంగా యింటికి తీసికొని వస్తాడని అర్థం.

"ఇప్పడు ఎప్పుడు" అనేది దేవాలయారాధనలో వాడే ఆశీర్వచనం. ఇప్పటినుండి ఎల్లకాలం వరకు ప్రభువు భక్తుణ్ణి ఆదరిస్తుంటాడని భావం. ఈ దీవెన సూచించినట్లుగానే ఈ కీర్తన మనకు కూడ ఇప్పుడూ యెప్పుడూ ఊరట కలిగిస్తూనే ఉంటుంది. ఇది యాత్రికుని చేతిలోని ఊతకర్రలాంటిది. ఈ కీర్తనంలో దేవళంలోని ఆరాధన వాతావరణం కనిపిస్తుందని చెప్పాం. అందుకు ఈ "ఇప్పడు ఎప్పుడు" అనే ప్రయోగమే సాక్షి.