పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


7 ప్రభువు నిన్ను సకలాపదలనుండి కాపాడును
నిన్ను సురక్షితముగా నుంచును
8 అతడు నీ రాకపోకలన్నింటను
ఇప్పడును ఎప్పడును నిన్ను కాపాడును.

1. పరిచయం

120-134 కీర్తనలకు 'యాత్రిక కీర్తనలు" అని పేరు. భక్తులు యెరూషలేమునకు యాత్రచేసేపుడు ఈ గీతాలను పాడుకొనేవాళ్ళ ఈ పాటల్లో కన్పించే అంశాలు ఇవి. భక్తులు దేవుణ్ణి గాఢంగా నమ్మేవాళ్ళు అతన్ని తలంచుకొని ఆనందించేవాళ్ళ తమకోర్మెలు తీర్చినందులకు ప్రభువుకి వందనాలు చెప్పేవాళ్ళు తమకు ప్రభువు దీవెనలు లభించాలని కోరుకొనేవాళ్ళ కొన్ని మారులు విజ్ఞానసూక్తులు కూడ కన్పిస్తాయి. మొత్తంమిూద ప్రజల భక్తిజీవితం ఈ గీతాల్లో ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. మనం ఈ వర్గంనుండి ఐదు కీర్తనలు పరిశీలిద్దాం.

121వ కీర్తనలోని ముఖ్యాంశం దేవుణ్ణి నమ్మడం. యెరూషలేము యాత్రకు బయలుదేరిన భక్తుడు ప్రభువు తన్ను సురక్షితంగా ఆ నగరానికీ, అక్కడినుండి మళ్ళా యింటికి చేర్చుతాడని నమ్మాడు. ఆ దేవుడు గొర్రెల కాపరిలా తన్ను కాపాడతాడనీ, కావలివానిలాగా నిద్రపోకుండా తన్ను సంరక్షిస్తుంటాడనీ విశ్వసించాడు. మన జీవితయాత్రలో ప్రభువు మనలను కూడ కాపాడుతూంటాడు. నేడు ఈ కీర్తనను భక్తితో జపించినపుడు గొప్పశాంతిభావం కలుగుతుంది. యాత్రికునికి చేతికర్రలా జీవితయాత్రలో మనకుకూడ ఈపాట ఉపయోగపడుతుంది, దీనిలో దేవళంలోని ఆరాధన వాతావరణంకూడ కన్పిస్తుంది.

2. వివరణం

1. కీర్తనకారుడు పారజూచింది యెరూషలేములోని సియోను కొండవైపు కాదు. ఆ నగరానికివెళ్ళే త్రోవలో తగిలే చాల కొండలవైపు, యెరూషలేము దారి చాల కొండలగుండా మెలికలు మెలికలుగా సాగిపోతుంది. ఆరోజుల్లో ఆ కొండలగుండా ప్రయాణం చేయడం కష్టం. ఎన్నో అపాయాలు ఎదురయ్యేవి. ఈ ప్రమాదంనుండి తప్పించుకోడానికి సహాయం ఎక్కడినుండి వస్తుంది? యెరూషలేములోని దేవునినుండే ఇక్కడ భక్తుడు తన ప్రయాణారంభంలో, త్రోవలో ఎదురయ్యే ప్రమాదాలను తలంచుకొని, దేవునినుండి సహాయం అడుగుకొంటున్నాడు.