పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన్నించి అతనికి శాంతి సంతోషాలు దయచేసి ఉండవచ్చు. ఈ భాగ్యాలకు అతడు ప్రభువుకి వందనాలు చెప్తాడు. కనుక వందన సమర్పణం వీటిల్లో ముఖ్యాంశం. ఈ వర్గం కీర్తనలు 30, 65,107 మొదలైనవి.

స్తుతి కీర్తనలు కూడ ఇంచుమించు కృతజ్ఞతా కీర్తనల్లాగే ఉంటాయి. రెండు వర్గాలూ దేవుణ్ణిస్తుతించి ధన్యవాదాలు చెప్తాయి. ఆ రెండింటికి వ్యత్యాసం ఇది. స్తుతి కీర్తనలు భగవంతుడు సర్వసాధారణంగా నరులందరికి చేసే ఉపకారాలను పేర్కొని అతనికి వందనాలు చెప్తాయి. కృతజ్ఞతా కీర్తనలు అతడు ఓ ప్రత్యేక వ్యక్తికి చేసిన ఓ ప్రత్యేక ఉపకారాన్ని పేర్కొని వందనా లర్పిస్తాయి.

ఈ 32వ కీర్తన యథార్థంగా మూడు వర్గాలకు చెందుతుంది. ఇది విలాప కీర్తనం, కృతజ్ఞతా కీర్తనం, జ్ఞాన కీర్తనం కూడ. ఐనా మనం ఇక్కడ దీన్ని ప్రధానంగా కృతజ్ఞతా కీర్తనంగా గ్రహిద్దాం.

ఈ కీర్తన వ్రాసిన భక్తుడు ఏదో పెద్ద పాపం చేసాడు. ఐతే అతడు దేవుని యెదుట తన తప్పను ఒప్పకోలేదు. దాన్ని కప్పిపెట్టుకొన్నాడు. దీనికి శిక్షగా దేవుడతనికి తీవ్రమైన మానసిక క్షోభను తెచ్చిపెట్టాడు. అతని అంతరాత్మ అతన్ని తీవ్రంగా చీవాట్ల పెట్టడం మొదలెట్టింది. ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అతనికి మనశ్శాంతి కలుగలేదు. అప్పడతడు తన అవివేకాన్ని గుర్తించి దేవుని యెదుట తన పాపాన్ని వొప్పకొన్నాడు. దానితో అతనికి పాపపరిహారమూ చిత్తశాంతీ లభించాయి. ఈ యనుభవాన్ని ఆధారంగా తీసికొని అతడు భావితరాలవాళ్లకు గొప్ప సలహాయిచ్చాడు. నరుడు పాపం చేసినపుడు తనంతట తానే దేవుని ముందట తన దోషాన్ని వొప్పుకోవడం మంచిది. లేకపోతే దేవుడు నరుడ్డి నిర్బంధంచేసి ఆ దోషాన్ని వొప్పిస్తాడు. ఈలా యీ కీర్తనం పశ్చాత్తాపం వలని ప్రయోజం, అంతరాత్మ పీడనం, చిత్తశుద్ధి మొదలైన గొప్ప విలువలకు అద్దం పడుతుంది. ఇది యేడు పశ్చాత్తాప కీర్తనల్లో ఒకటి కూడ.

2. విభజనం

దీనిలో రెండు భాగాలున్నాయి. మొదటిది, రచయిత పాపానుభవం. రెండవది, భావితరాలవాళ్లకు అతడు చేసిన ఉపదేశం.

1-7 పాపాన్నీ పాపపరిహారాన్నీ గూర్చిన రచయిత వ్యక్తిగతానుభవం
8-11 నరులు తమంతటతామే పశ్చాత్తాపపడాలని ఉపదేశం.