పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన పీఠాలమీద ప్రత్యక్షం చేసికోవడమని భావం. గురువు క్రీస్తు స్థానంలో నిల్చి యిది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పగానే అప్పమూ రసమూ ఆ ప్రభువు శరీర రక్తాలుగా మారిపోతాయి. రొట్టెరసాల స్థానంలో ప్రభువు సాక్షాత్కరిస్తాడు. ఈ సాక్షాత్కారమే ప్రకటనం.

ఇక్కడ ఇంకో విషయం గూడ గమనించాలి. క్రీస్తు మనలను రక్షించింది కేవలం మరణం ద్వారా మాత్రమే కాదు, ఉత్థానం ద్వారా కూడ. ఈ ప్రభువు మరణం ద్వారా మనకు పాపపరిహారమూ, ఉత్తానం ద్వారా వరప్రసాద ప్రాప్తి లభిస్తాయి. కనుక ఎప్పడు గూడ క్రీస్తు మరణోత్తానాలు కలసిపోతూండాలి. మన పూజలో ప్రకటనమయ్యేది, అనగా ప్రత్యక్షమయ్యేది మృత క్రీస్తు కాదు. మృతుడై ఉత్తానుడైన క్రీస్తు, సిలువ మరణాన్నీ ఆ మరణ ఫలితాన్నీ తనలో నిల్పుకొన్న ఉత్తాన క్రీస్తు మన సత్రసాదంలో ప్రత్యక్షమౌతాడు.

4. దేవుని రాజ్యాo వచ్చేదాక గూడ

ప్రభువు ద్రాక్ష సారాయాన్ని ఆశీర్వదించి దాన్ని తన రక్తంగా మార్చి శిష్యులకిచ్చాడు. తాను మాత్రం దాన్ని త్రాగలేదు. "దేవుని రాజ్యం వచ్చేదాకా గూడ నేను ఈ ద్రాక్షసారాయాన్ని త్రాగను" అన్నాడు — లూకా 22,19, మార్కు 14,25. దీని భావం ఏమిటి?

యూదులు ఏదైనా పనికి పూనుకొనేపుడు ప్రతాన్ని పట్టడం అలవాటు. ఉదాహరణకు యెరూషలేములోని యూదులు పౌలుని చంపిందాకా అన్నపానాలు ముట్టకోమని వ్రతం పట్టారు - అచ 23,12. అలాగే ప్రభువు కూడ ఇక్కడ ఓ వ్రతం పట్టి వుండవచ్చు. అదే జరిగివుంటే ఆ కార్యం భావం యిది. అతడు మనకోసం చనిపోవడానికి సిద్ధమయ్యాడు ఆ ఘడియ సమీపించింది కూడ. ఆ మరణం నెరవేరిందాకా తాను అన్నపానీయాలు ముట్టుకోడు. తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికై దీక్ష పూనుతాడు. ఆ దీక్ష భోజన పానీయాలు విసర్జించిన స్నాపక యోహాను దీక్షలాంటిది - లూకా 7,33.

ఇక క్రీస్తు మరణంతో పాపపరిహారం జరిగి దైవరాజ్యం సిద్ధిస్తుంది. ఆ దైవరాజ్యంలో ప్రభువు మళ్ళా శిష్యులతో ద్రాక్షసారాయం సేవిస్తాడు. అనగా మరల వారలతో విందారగిస్తాడు. ఎందుకంటే దైవరాజ్యం సంతోషపూరితమైంది. యూదుల భావం ప్రకారం విందూ ద్రాక్షసారాయమూ సంతోష చిహ్నాలు. బైబుల మోక్షాన్ని కూడ విందుగా భావిస్తుంది.

'దైవరాజ్యం వచ్చేదాకా" అన్న లూకా పదాలనే పౌలు "ప్రభువు మళ్ళా వచ్చేదాక" అని పేర్కొన్నాడు - 1కొరి 11,26. అనగా ప్రభువు రెండవ రాకడ అన్నా దైవరాజ్యం రాకడ అన్నా ఒకటే. కాని దైవరాజ్యం రావడం లేక రెండవరాకడ ఎప్పడు జరుగుతుంది? ఇక్కడ