పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీన్ని సిఫార్పు చేసాడు. ఈ ప్రక్రియలో ఈవరకే మన్నింపబడిన మన పూర్వ పాపాల్లో ముఖ్యమైనవాటిని మళ్ళా ఓసారి పాపోచ్చారణంలో చెప్పుకుంటా0. దీనిద్వారా మనలో పశ్చాత్తాపం పెరుగుతుంది. పూర్వ పాపాలవలన కలిగిన గాయాలు బాగా మానతాయి. భావిజీవితానికి వలసిన వరప్రసాదం అధికంగా లభిస్తుంది.కాని ఈలాంటి పాపోచ్చారణం చేయమని విశ్వాసుల నెవరు నిర్బంధం చేయకూడదు. వాళ్ళంతట వాళ్ళే స్వేచ్చగా దాన్ని చేసుకోవాలి.

భక్తికొరకు చేసే పాపోచ్చారణంవల్ల విశేషంగా రెండు లాభాలున్నాయి. మొదటిది, మనకు రావలసిన అనిత్య శిక్షను కొంతవరకు తొలగించుకొంటాం. పాపోచ్చారణం వల్ల నిత్యశిక్షయైన నరకాన్ని మాత్రమే తప్పించుకొంటాం. అనిత్యశిక్షను - అనగా మన పాపాలకుగాను కొన్ని బాధలు అనుభవించడం–తప్పించుకోలేం. దాన్ని ఈ లోకంలోనో ఉత్తరించే స్థలంలోనో అనుభవించి తీరాలి. భక్తికొరకు చేసే పాపోచ్చారణం ద్వారా ఈ యనిత్య శిక్ష కొంతవరకు తీరుతుంది.

రెండవది, పాపం పరిహారమయ్యాక గూడ మనకు చెడ్డను చెయ్యాలనే కోరిక వుంటుంది. మంచిని చేయాలంటే బద్దకింపుగా వుంటుంది. సృష్టివస్తువులమిదికి మనసు బలంగాపోతుంది. ఈ మనస్తత్వాన్నే వేదశాస్త్రులు "పాపావశేషం" అంటారు. ఇక, ఈ పాపోచ్చారణం ద్వారా మనం ఈ మనస్తత్వాన్ని జయించి భక్తిని పెంపొందించుకోవచ్చు. ఇన్ని సత్ఫలితాలున్నాయి కనుక అవకాశమున్నపుడెల్లా ఈ పుణ్యక్రియలో పాల్గొనడం లాభదాయకం.

5. ఆత్మశోధనం

పాపోచ్చారణం చేయకముందు విశ్వాసులు జాగ్రత్తగా ఆత్మశోధనం చేసికోవాలి. జపపుస్తకాల్లో రకరకాల ఆత్మశోధనలు కన్పిస్తాయి. వాటిల్లో వేటినైనా వాడుకోవచ్చు మామూలుగా ఈ యాత్మశోధనంలో ఒక నియమిత పద్ధతి ననుసరిస్తే బాగుంటుంది. ఉదాహరణకు దేవునిపట్ల తోడినరుల పట్ల మనపట్ల మనం నిర్వర్తించవలసిన బాధ్యతలను పరిశీలించి చూచుకోవడం ఒక పద్ధతి.

ఇక ఆత్మశోధనంలో ప్రధానమైంది ప్రేమాజ్ఞ. అనగా మనం దైవప్రేమనుగాని సోదరప్రేమనుగాని ఎంతవరకు పాటించామా అని పరిశీలించి చూచుకోవాలి. ఇంకా కేవలం ఆయా పాపక్రియలను చేసామా లేదా అనిమాత్రమే పరిశీలించి చూచుకొంటేనే చాలదు. హృదయంలోని కోరికలను గూడ పరీక్షించి చూచుకోవాలి. ఉదాహరణకు వ్యభిచారం చేసినప్పుడు మాత్రమే గాదు, చేయాలని బుద్ధిపూర్వకంగా కోరుకొన్నపుడు గూడ పాపమే ఔతుంది - మత్త 5,27-28.