పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆత్మశోధనమంటే కేవలం మన తప్పుల జాబితాను సిద్ధం చేసికోవడం మాత్రమే కాదు. మన హృదయంవైపు మనం చూచుకొంటూ, మనతో మనం సంభాషించుకొంటూ కూర్చోవడం అసలే కాదు. ఆత్మశోధనంలో మనం పరిశుద్దుడైన దేవుని ముందు నిలబడతాం, జ్ఞానస్నానంలో అతడు మనలను పరిశుద్ధ జీవితం జీవించమని ఆదేశించాడు. ఆ కరుణగల దేవుని ఆదేశాన్ని మనం ఎంతవరకు పాటించామా అని ఆలోచించి చూచుకోవాలి. కనుక ఈ ప్రక్రియలో మనం మనకోసం సిలువపై చనిపోయిన క్రీస్తువైపు చూడాలి గాని కేవలం మనవైపే చూచుకొంటూ కాలం వెళ్ళబుచ్చగూడదు.

ఆత్మశోధనం చేసికొనేపుడు మనమేమి పాపం చేసాములే అని చులకన భావం చూపకూడదు. ప్రపంచంలోకెల్లా మనమే ఫరోరపాపుల మనుకొని నిరుత్సాహపడనూ కూడదు. దేవుని యెదుటా శ్రీసభ యెదుటా నమ్మకంతో మనలను మనం పరిశీలించి చూచుకోవాలి, అది చాలు. మనం పవిత్రులమయ్యేకొద్దీ మన ఆత్మశోధనం నిశితమౌతుంది. పవిత్రాత్ముడు మనలను మనం నూత్నదృక్కోణాలనుండి పరిశీలించి చూచుకొనే భాగ్యాన్ని దయచేస్తాడు. అధిక చిత్తశుద్ధితో పరీక్షించి చూచుకొనే వరాన్ని గూడ ప్రసాదిస్తాడు.

ఆత్మశోధనంలో మనం బాహ్యక్రియలనే గాదు, ఆ క్రియలు వెలువడ్డానికి కారణమైన మన అంతరంగిక దృక్పథాలను గూడ పరిశీలించుకోవాలి. ఉదాహరణకు నేను ఉదయ సాయంకాల ప్రార్థనలు చెప్పలేదు అనుకొంటే చాలదు. నేను దేవుణ్ణి అట్టే పట్టించుకోలేదు కనుక ఈ ప్రార్థనలు చెప్పలేదు అనుకోవాలి. నేను పాడుచూపులు చూచాను అనుకొంటే చాలదు. నేను కామవాంఛకు లొంగిపోయాను గనుక పాడు చూపులు చూచాను అనుకోవాలి. తర్వాత పాపోచ్చారణంలో ఈ దృక్పథాలు కూడ వివరించి చెప్పి మనలను మనం తగ్గించుకోవడం మంచిది. మనం చేయవలసి గూడ చేయకుండా వదలివేసిన కార్యాలను గూడ ఇక్కడే జ్ఞప్తికి తెచ్చుకోవాలి.

మామూలుగా ఆత్మశోధనను కృతజ్ఞతా ప్రార్ధనంతో ప్రారంభించడం మెరుగు. దానివల్ల దేవుడు మనకు ఎన్నివరాలు దయచేసినా మనం అతన్ని సేవించడంలో ఎంతో అశ్రద్ధ చూపుతున్నాం అనే భావం కలిగి పశ్చాత్తాపం బలపడుతుంది. ఇంకా బైబులు గ్రంథాన్ని చదవకొని ఆత్మశోధనం చేసికోవడం మంచిది. దైవవాక్కు గొప్ప వెలుగు. అది మన హృదయంలోని చీకటిని పటాపంచలు చేస్తుంది.

6. ఎంత తరచుగా పాపోచ్చారణం చేయాలి?

ఏడాదికి ఒక్కసారైనా పాపోచ్చారణం చేయాలన్నది 1125 నాటి ఆజ్ఞ. ఇంత గొప్ప వరప్రసాద సాధనాన్ని విశ్వాసులు తప్పక వినియోగించుకోవాలని ఈ యాజ్ఞ భావం, కాని పవిత్రులు కాగోరే విశ్వాసులు ఏడాదికి ఒక్కసారి పాపోచ్చారణం చేస్తే చాలదు.