పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.సిరిల్ భక్తుడు ఈలా నుడివాడు. "జ్ఞానస్నానముద్ర ద్వారా మీరు క్రీస్తురాజు సైనికులౌతారు. రాజు కొలువులో చేరిన సైనికుల హస్తంమీద ఆ రాజముద్రను పొడుస్తారు. ఆ సైనికులు ఆ రాజును సేవించేవాళ్ళని ఆ ముద్ర భావం. మీరిప్పడు స్వర్గాధిపతియైన ప్రభువుని ఎన్నుకొన్నారు. కనుక మీరు ఆ రాజుని సేవించే సైనికులయ్యారు".

3.జ్ఞానస్నానానికి ముందు పిశాచపరిత్యాగం వుంటుంది. పూర్వం యిస్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తుండగా ఐగుప్తుయులు వాళ్ళవెంటబడ్డారు. యిస్రాయేయులను మళ్ళా పట్టుకొనివెళ్ళి బానిసలనుగా వాడుకోవాలని వాళ్ళ కోరిక, కాని ప్రభువు యిస్రాయేలీయులను ఐగుప్తుయులకు చిక్కనీయలేదు. మన విషయంలో గూడ ఈలాగే జరుగుతుంది. జ్ఞానస్నానంద్వారా మనం పిశాచ సామ్రాజ్యం నుండి క్రీస్తు సామ్రాజ్యములో చేరతాం. కాని పిశాచం మనలను అంతసులభంగా వదలదు. మనలను మళ్ళాపట్టుకొని పోగోరుతుంది. అందుకే గురువు పిశాచ పరిత్యాగ ప్రార్ధనల ద్వారా మనలనా దుష్టశక్తినుండి పూర్తిగా విడిపిస్తారు. ఈ సందర్భంలో గురువు నీవు పిశాచాన్నీ దాని క్రియలనూ ఆడంబరాలనూ పరిత్యజిస్తున్నావా అని ప్రశ్నిస్తారు. మనం ఔనని జవాబు చెప్తాం. ఇక్కడపిశాచక్రియలంటే పాపకార్యాలు. పిశాచాడంబరాలంటే మనలను పాపానికి పరికొల్పే లోకాడంబరాలు. మనం వీటన్నిటినీ పరిత్యజించి దైవరాజ్యంలో చేరాలి. క్రీస్తు నరులకు పాపవిమోచనం కలిగించాక గూడ ఈలోకం మీద పిశాచం ప్రభావం వుంటుంది. మనం కూడ ఈ దుప్రభావానికి లోనవుతూంటాం. పై పిశాచ పరిత్యాగ ప్రమాణాలవల్లనూ, ఆప్రమాణాలను మళ్లామళ్ళా భక్తితో నూతీకరించుకోవడం వల్లనూ ఆ ప్రభావాన్నుండి కొంతవరకయినా తప్పించుకో గల్లుతాం. ఈ సందర్భంలో జ్ఞానస్నాన తంతులో గురువు చెప్పే ఓ ప్రార్ధనం ఇది. "ఓ ప్రభూ! మీ దివ్యకుమారుని శ్రమలద్వారా, అతని పునరుత్తాన ఫలితాల ద్వారా, ఈ యభ్యర్థిని అంధకార శక్తినుండి విడిపించండి. క్రీస్తు వరంబలంవల్ల ఇతన్ని బలపరచండి. మీ నిత్య సంరక్షణం ద్వారా ఇతనిని ఈ జీవిత యాత్రలో కాచికాపాడండి". ఈలాంటి జపాలను మనం భక్తితో పునశ్చరణం చేసి కొంటూండాలి.

4.జ్ఞానస్నానం చాల గొప్పభాగ్యం, దాని ద్వారా క్రీస్తులోనికీ క్రీస్తుశరీరమైన శ్రీసభలోనికీ ఐక్యమౌతాం. దేవుని బిడ్డలమై దివ్యజీవితం జీవించడం మొదలిడతాం.