పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. జ్ఞానస్నాన ఫలితాలు

జ్ఞానస్నాన ఫలితాలు చాలా వున్నాయి. ప్రస్తుతానికి ఆరింటిని పేర్కొందాం. కాని వీటిని ఆరుగా విభజించి చూపించినా, ఇవన్నీ ఒకే ఫలితం అని చెప్పడం సబబు.

1. జ్ఞానస్నానం మనలను శ్రీసభలో చేరుస్తుంది.

జ్ఞానస్నానం చేసే మొదటిపని, మనలను శ్రీసభలోనికి చేర్చి ఆ సభ సభ్యులనుగా చేయడం. యూదులమైనా గ్రీసు దేశీయులమైనా, దాసులమైనా, స్వతంత్రులమైనా, మన మందరమూ ఒక్క శరీరంలోనికి జ్ఞానస్నానం పొందుతాం అన్నాడు పౌలు - 1కొరి 12, 13. ఈ వొక్క శరీరం తిరుసభే, ఇంకా అతడు శరీరమొక్కటే, ప్రభువొక్కడే, విశ్వాస మొక్కటే, జ్ఞానస్నానమొక్కటే అని కూడ వాకొన్నాడు - ఎఫే 4, 4-5. అనగా జ్ఞానస్నానం ద్వారా మనం ఒకే క్రీస్తులోనికీ, ఒకే తిరుసభలోనికీ చేరిపోతామని భావం.

"మొట్టమొదట వచ్చే సంస్కారం జ్ఞానస్నానం. అది ఆధ్యాత్మిక జీవితానికి ద్వారం లాంటిది. దాని ద్వారా మనం క్రీస్తుదేహానికి అవయవాల మౌతాం. అతని దేహమైన శ్రీసభలో సభ్యులమౌతాం” అని బోధించింది ఫ్లోరెన్సు మహాసభ, ట్రెంటు మహాసభకూడ "జ్ఞానస్నానం ద్వారా నరుడు మొదటిసారిగా శ్రీసభలో చేరతాడు” అని వాకొంది.

కనుక ఈ సంస్కారం ద్వారా మనం ఈ సభ సభ్యులమౌతాం. ఆ సబ్యుల హక్కులనూ బాధ్యతలనూ గూడ పొందుతాం. ప్రభువు ఆరాధనలో పాల్గొంటూ ఇతర సంస్కారాలను గూడ స్వీకరించడానికి అర్హులమౌతాం.

గురువు జ్ఞానస్నానం పొందిన వ్యక్తిపేరును స్థానిక దేవాలయపు రిజిస్టరులో వ్రాస్తారు. ఇది మనం తిరుసభలో చేరామనడానికి గుర్తు, పూర్వం రోమను సొరంగాల్లో మంచి కాపరి తన గొర్రెల మందను తన చుట్టు ప్రోగుజేసికొని వున్నట్లుగా చిత్రించారు. ఈ మందే శ్రీసభ. అనగా మనం ఈ సంస్కారం ద్వారా ఈ మందలోనికి, ఇది సూచించే శ్రీసభలోనికీ చేరతామని ప్రాచీన క్రైస్తవుల భావం. ఇంకా, జ్ఞానస్నానం పొందిన క్రైస్తవులు గుడిలోనికి ప్రవేశించి మొదటిసారిగా పూజలో పాల్గొని దివ్యసత్రసాదం పుచ్చుకొంటారు. ఈ దివ్యభోజనం క్రైస్తవ ప్రజలను ఐక్యపరచే సాధనం. ఈ క్రియ ద్వారా గూడ ఆ ప్రజలు క్రైస్తవ సమాజంలోనికీ శ్రీసభలోనికీ ప్రవేశించారని సూచించినట్లవుతుంది.

శ్రీసభ క్రీస్తు ఆధ్యాత్మిక దేహం. ఆ సభ పవిత్ర కన్యా పవిత్రమాతా కూడ. ఆమె కన్యమాతగానే జ్ఞానస్నానమార్గాన మనలను కంటుంది. మనకు దివ్య జీవనాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ సంస్కారం ద్వారా ఈ సభ నిరంతరమూ పెరుగుతూంటుంది.