పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. జ్ఞానస్నాన సంస్కారం మన విశ్వాసాన్ని పెంచేదైతే, చిన్నబిడ్డల్లో ఈ కార్యం ఏలా నెరవేరుతుంది? పసిబిడ్డల్లో విశ్వాసం ఏలా వుంటుంది? దాన్ని వాళ్ళు బయటికి ఏలా వ్యక్తం చేస్తారు?

జ్ఞానస్నానం పొందే చిన్నబిడ్డమీద మొదట శ్రీసభ విశ్వాసం సోకుతుంది. తర్వాత తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు మొదలైనవాళ్ల విశ్వాసం బిడ్డమీద సోకుతుంది. అటుపిమ్మట జ్ఞానస్నాన సంస్కారం దయచేసే విశ్వాసం ఆ బిడ్డ హృదయంలో బీజంలా పడుతుంది. బిడ్డకు ప్రాయమొచ్చే కొద్దీ తల్లిదండ్రుల కృషివల్లా, బిడ్డ స్వీయకృషివల్లా ఈ బీజం మొలకెత్తి ఫలిస్తుంది.

బిడ్డ తన విశ్వాసాన్ని స్వయంగా వ్యక్తం చేయలేకపోయినా, తల్లిదండ్రులూ జ్ఞాన తల్లిదండ్రులూ ఆ బిడ్డ విశ్వాసాన్ని వ్యక్తం చేయగలరు. కనుకనే ఆగస్టీను భక్తుడు ఈలా వాకొన్నాడు "చిన్నబిడ్డలకు తల్లియైన తిరుసభ ఇతరుల కాళ్ళను దయచేస్తుంది. కనుక ఆ బిడ్డలు నడచి వస్తారు. ఇతరుల హృదయాలను దయచేస్తుంది. కనుక వాళ్ళు నమ్ముతారు. ఇతరుల నాలుకను దయచేస్తుంది. కనుక వాళ్ళు తమ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. బిడ్డను మోసికొని వచ్చే వ్యక్తి ఆ బిడ్డ తరపున జవాబు చెప్తాడు. పూర్వం ఒక నరుని చెయిదంవల్ల ఆ బిడ్డకు గాయం తగిలింది. ఇప్పడు మరొక నరుని వాక్యం వలన ఈ శిశువుకి ఆరోగ్యం కలుగుతుంది. ఈ బిడ్డడు క్రీస్తుని విశ్వసిస్తాడా అని జ్ఞానస్నానమిచ్చే గురువు ప్రశ్నిస్తాడు. బిడ్డను మోసికొని వచ్చినవ్యక్తి యితడు విశ్వసిస్తున్నాడు అని జవాబు చెప్తాడు. అది చాలు". ఈ వాక్యంలో అగస్టీసు ఉద్దేశించిన "ఇతరులు" తల్లిదండ్రులూ, జ్ఞానతల్లిదండ్రులూను.

జ్ఞానస్నాన సంస్కారం ఆ సంస్కారాన్ని పొందక ముందే మన హృదయంలో విశ్వాసాన్ని పుట్టిస్తుందని చెప్పాం. ఆ సంస్కారాన్ని పొందాక అది యీ విశ్వాసాన్ని ఇంకా పెంచుతుందని గూడ చెప్పాం. కనుకనే వేదశాస్త్రులు ఇది విశ్వాసాన్ని దయచేసే సంస్కారమని వాకొన్నారని గూడ తెలియజేసాం. కనుక దీనిలో విశ్వాసం అతి ముఖ్యం. కొంతమంది కక్మూర్తికొద్ది ఎవరికిబడితే వాళ్ళకు జ్ఞానస్నానమిస్తుంటారు. మేమింతమందికి జ్ఞానస్నానమిచ్చాము చూడండని వట్టిసంఖ్యలు చూపించుకొని మురిసిపోతుంటారు. ఇది చెడ్డ పద్ధతి. తగినంత విశ్వాసం లేనివాళ్ళకు త్వరపడి జ్ఞానస్నానం ఈయకూడదు. విశేషంగా పల్లెల్లో ఓ కుటుంబంవాళ్ళంతాగాని, ఇంకా చాల కుటుంబాలవాళ్ళు మూకుమ్మడిగా గాని, జ్ఞానస్నానం పొందేపుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. ప్రతివ్యక్తికీ తగినంత విశ్వాసముంటేనేగాని జ్ఞానస్నానం ఈయకూడదు.