పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయా జాతులకు బోధచేసేవాళ్లు, అటుతరువాత తమ బోధను వినినవారికి నీటితో జ్ఞానస్నానమిచ్చేవాళ్ళు ఆత్మలో విశ్వాసం నెలకొనిన పిదపగాని దేహాన్ని నీటితో కడగడమనేది జరుగదు". ఇంకా బాసిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "రక్షణానికి విశ్వాసమూ జ్ఞానస్నానమూ రెండు అవసరమే. మొదట హృదయంలో విశ్వాసం పడుతుంది. మనలను రక్షించేది ఆ విశ్వాసమే. అటుపిమ్మట జ్ఞానస్నానం పొందుతాం. ఈ తంతు మన విశ్వాసాన్ని సురక్షితం చేస్తుంది".

జ్ఞానస్నానం పొందడానికి విశ్వాసం అవసరమని చెప్పాము. కాని వేదాంతులు జ్ఞానస్నానం విశ్వాసాన్ని దయచేసే సంస్కారమని చెప్తారు. మన హృదయంలో జ్ఞానస్నానానికి ముందే విశ్వాసముంటే, ఆ జ్ఞానస్నానం మళ్లా మనకు విశ్వాసాన్ని దయచేయడం ఏలా జరుగుతుంది?

ఈ సంస్కారం ద్వారా మన విశ్వాసమేమో తప్పక పెరుగుతుంది. బలపడుతుంది. ఇది ఏలాగు?

1. అన్ని సంస్కారాల్లాగే జ్ఞానస్నానంకూడ శ్రీసభ నెరవేర్చే కార్యం. ఈ శ్రీసభ క్రీస్తుని విశ్వసించి, క్రీస్తు పేరట సంస్కారాన్ని జరుపుతుంది. కనుక జ్ఞానస్నానం పొందే వాళ్ళమీద శ్రీసభ విశ్వాసం సోకుతుంది. ఆ తల్లి విశ్వాసం తన బిడ్డలకు సంక్రమిస్తుంది. ఈ విధంగా మన విశ్వాసం పెరుగుతుంది.

2. జ్ఞానస్నానం పొందే వ్యక్తికి ఆ సంస్కారాన్ని స్వీకరించకముందే క్రీస్తునందు కొంత విశ్వాసముంటుంది. అతడు ఈ సంస్కారాన్ని పొందేప్పడు విశ్వాస సంగ్రహజపాన్ని జపిస్తాడు. ముగ్గురు దైవవ్యక్తులను నమ్ముతున్నానని ప్రమాణం చేస్తాడు. దీనివల్ల అతనిలో విశ్వాసముందనే అనుకోవాలి.కాని జ్ఞానస్నానానికి పూర్వం భక్తుని హృదయంలో పుట్టిన ఈ విశ్వాసం, అతడు తర్వాత పొందబోయే జ్ఞానస్నాన సంస్కారాన్నిబట్టే పుట్టింది. క్రీస్తు శ్రీసభలో నెలకొల్పిన జ్ఞానస్నాన సంస్కారం ద్వారా ఈ నరులు యథార్థంగా శ్రీసభలో చేరతారు. కనుక మొదట వాళ్ళ హృదయంలో క్రీస్తుపట్ల విశ్వాసం పుడుతుంది. తర్వాత వాళ్ళు ఈ సంస్కారాన్ని స్వీకరించి క్రీస్తు శిష్యులౌతారు. అందుచేత జ్ఞానస్నానాన్ని స్వీకరించని విశ్వాసం పరిపూర్ణమైనది కాదు. ఇంకా శ్రీసభలో జ్ఞానస్నానమనేది లేకపోతే అసలు మన హృదయంలో విశ్వాసమే పట్టదు. లూతరు జ్ఞానస్నానం కాదు. విశ్వాసం మనలను రక్షిస్తుంది అన్నాడు. ఇది పొరపాటు, విశ్వాసం దానంతట అది మనలను రక్షించదు. మనలను జ్ఞానస్నానం వైపు త్రిప్పతుంది కనుకనే అది మనలను రక్షిస్తుంది.

ఫలితాంశమేమిటంటే, జ్ఞానస్నాన సంస్కారమే మొదట మనలో విశ్వాసం పుట్టించి మనలను క్రీస్తువైపు ఆకర్షిస్తుంది. కనుక మనం ఆ సంస్కారాన్ని పుచ్చుకొంటాం. ఆలా పుచ్చుకొన్న పిదప ఆ పూర్వ విశ్వాసం ఇంకా పెరుగుతుంది.