పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జ్ఞానస్నానజలాల ద్వారా మనకు గూడ దృష్టినీ వెలుగునీ ప్రసాదిస్తాడు. కనుకనే పౌలు "ఓయి నీవు నిద్రనుండి మేల్కొనాలి. క్రీస్తు నీకు వెలుగుని దయచేస్తాడు" అని హెచ్చరించాడు - ఎఫె 5, 14.

కాని ఈ వెలుగు ఏమిటి? క్రీస్తునందు విశ్వాసమే. ప్రభువు పై గ్రుడ్డివానికి చూపుని ప్రసాదించిన తర్వాత నీవు దేవుని కుమారుని విశ్వసిస్తున్నావా అని అడిగాడు. అతడు విశ్వసిస్తున్నాను ప్రభో అని క్రీస్తు పాదాలకు మొక్కాడు - యోహా 9, 35-38. అనగా ప్రభువు ఆ గ్రుడ్డివానికి భౌతిక దృష్టినీ విశ్వాస దృష్టినీ గూడ అనుగ్రహించాడు. ఈనాడు జ్ఞానస్నానంలో మనకు దయచేసేది కూడ ఈ విశ్వాస దృష్టినే.

జ్ఞానస్నానమిచ్చే వెలుగు విశ్వాసమేనని చెప్పాం. పెద్దవాళ్ళు జ్ఞానస్నానం పొందేప్పడు విశ్వాసముండాలి. ముగ్గురు దైవవ్యక్తులను విశ్వసించందే ఈ సంస్కారాన్ని ఈయకూడదు. అనగా జ్ఞానస్నానానికి ముందే విశ్వాసముండాలి. ఐనా ఈ సంస్కారం ప్రధానంగా మన విశ్వాసాన్ని పెంచేది. ఈ దివ్యకార్యం మనలను క్రీస్తుతో జోడిస్తుంది. విశ్వాసంద్వారా గాని మనం క్రీస్తుని దర్శించం. కనుక ఆ ప్రభువుని దర్శించడానికి అవసరమైన విశ్వాసాన్ని ఈ దివ్యకార్యం మనకు దయచేస్తుంది. ఈ సంస్కారానికి ముందే మనకు ముగ్గురు దైవ వ్యక్తులమీద విశ్వాసముండాలని చెప్పాం. ఈ సంస్కారం తర్వాత మన విశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా ఆ ముగ్గురు దైవవక్తలు మనహృదయంలోకి విచ్చేసి దానిలో ఓ దేవాలయంలోలాగ వసిస్తారు - 1 కొరి 6,19.

జ్ఞానస్నానం పొందిన వ్యక్తి చేతిలో వెలుగుతున్న కొవ్వు వత్తిని పెడతాం. పాస్కవత్తిలాగే ఈ వత్తికూడ క్రీస్తుకి చిహ్నం. ఆ ప్రభువు మనలను వెలిగించే వెలుగు. కనుకనే యోహాను "నిజమైన వెలుగొకటి వుంది. అది ఈ లోకంలోకి వచ్చే ప్రతి నరుణ్ణి వెలిగిస్తుంది" అని చెప్పాడు- 19. తండ్రే మనలను చీకటిలో నుండి ఈ యద్భుతమైన వెలుగులోనికి రప్పిస్తాడు - 1 పేత్రు 2,9.

పదిమంది కన్నెలూ వెలుగుతూన్న దివిటీలతో పెండ్లికుమారుని కొరకు వేచివున్నారు - మత్త 25, 1-7. వాళ్ళలాగే మనంకూడ జ్ఞానస్నానపు వెలుగుతో ప్రభువు రెండవ రాకడ కొరకు వేచివుండాలి. ఈలా ఈ సంస్కారం మనలను అంత్యకాలానికీ, అనగా ప్రభువు రెండవ రాకడకు, సిద్ధం చేస్తుంది.

9. జ్ఞానస్నానమూ పిశాచంతో పోరాటమూ

జ్ఞానస్నానం మనకు పిశాచంతో పోరాడ్డానికి వలసిన బలాన్ని దయచేస్తుంది. గురువు జ్ఞానస్నానాన్ని ఈయక ముందు పిశాచాన్ని పారద్రోలే ప్రార్థనలను జపిస్తారు.