పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదాహరణకు ఒక ప్రార్ధనం ఇది. "ఓ ప్రభూ! ఈ నీ సేవకులనుండి అవిశ్వాసాన్ని తొలగించు. విగ్రహారాధన, మాయాశక్తి పిశాచ మంత్రతంత్రాలు ధనాశా శరీరాశాపాశాలు వైరం స్పర్గా అవినీతికార్యాలూ తొలగించు. నీ సముఖంలో వీళ్ళు పవిత్రులూగా వుండేలా నీవు వీళ్ళను పిల్చావు. కనుక వీరికి విశ్వాసమూ భక్తి సహనముగా నమ్మకమూ నిగ్రహమూ నిర్మలత్వమూ ప్రేమా శాంతీ మొదలైన వరాలను దయచేయి". ఈలాంటి ప్రార్థనల ద్వారా పిశాచ ప్రభావాన్ని వదలించుకొంటాం. ఈ సందర్భంలో సిరిల్ భక్తుడు ఈలా చెప్పాడు. "కమసాలి బంగారాన్ని కొలిమిలో పెట్టి పటంచేస్తే దానిలోని మాలిన్యం తొలగి పోతుంది. ఆలాగే పిశాచ నిర్మూలన ప్రార్ధనం ద్వారా ఆత్మలోని పైశాచిక మాలిన్యం తొలగిపోయి ఆత్మ శుద్ధిని పొందుతుంది".

అటుపిమ్మట గురువు అభ్యర్దిని పరిశుద్ధ తైలంతో అభిషేకంచేసి "రక్షణ తైలంతో నిన్ను అభ్యంగనం చేస్తున్నాను. రక్షకుడైన క్రీస్తుని శక్తి నిన్ను బలపరుచుగాక" అని ప్రార్ధిస్తారు. పూర్వం గ్రీకు రోమను ప్రజలు బహిరంగక్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకూ యోధులకూ తైలంతో అభ్యంగనం చేసేవాళ్ళు దాని ద్వారా వాళ్ళ శారీరక బలాన్ని పొందేవాళ్చు. జ్ఞానస్నానాన్ని పుచ్చుకొనేవాళుకూడ పిశాచంతో యుద్ధం చేసే యోధుల్లాంటివాళ్లు కనుకనే జ్ఞానస్నానపు తంతులో ఈ యభ్యంగనాన్ని ప్రవేశపెట్టారు. దాని ద్వారా మనం ప్రభువు బలాన్ని పొంది పిశాచంతో పోరాడ్డానికి సమర్థుల మౌతాం.

పూర్వం జ్ఞానస్నానాన్ని పొందేవాణ్ణిమడుగులో ముంచేవాళ్ళని చెప్పాం. అతడు నీటిలోనికి పోయేవాడు. బైబులు భావాల ప్రకారం జలగర్భంలో జలభూతం వసిస్తూంటుంది. అది పిశాచానికి చిహ్నంగా వుంటుంది. సృష్టి చేసినప్పడే భగవంతుడు ఈ భూతాన్ని అదుపులోకి తెచ్చుకొన్నాడు. క్రీస్తు చనిపోయి పాతాళానికి దిగిందికూడ ఈ భూతాన్ని జయించడానికే. ఇక జ్ఞానస్నాన సమయంలో నీటిలోనికి మునిగే భక్తుడు కూడ సాంకేతికంగా క్రీస్తుతోపాటు పాతాళానికి వెళ్లాడు. క్రీస్తుతోపాటు తానూ భూతరూపమైన పిశాచంతో యుద్ధం చేస్తాడు. ప్రభువు బలంతోనే దాన్ని జయించి మల్లా మడుగులో నుండి వెలుపలికి వస్తాడు. ప్రభువే బలవంతుణ్ణి జయించిన మహా బలవంతుని సామెతను చెప్పాడు — లూకా 11, 21-22. ఈ మహాబలవంతుడు క్రీస్తు, అతడు జయించిన బలవంతుడు పిశాచం. ఈ ప్రభువుతో ఐక్యమై ఈనాడు మనం దయ్యాన్ని ఓడిస్తాం.

క్రీస్తునందు మనం పిశాచాన్ని సూత్రప్రాయంగా జయించినా జీవితాంతమూ మనం ఆ దుష్టశక్తితో పోరాడవలసిందే. పౌలు ఈ లోకంలో జీవించే క్రైస్తవుణ్ణి పిశాచంతో