పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీసభ అనే తల్లి జ్ఞానస్నానపుతొట్టి ఆనే తన గర్భంనుండి ప్రకాశపుత్రులమైన మనలను పవిత్రాత్మ వరప్రసాదం ద్వారా కంటుంది అని చెప్తుంది ఓ ప్రాచీన ప్రార్ధనం.

నీటికి సహజంగానే మృత్యువు, జీవం అనే భావాలున్నాయని చెప్పాం. క్రీస్తు ఈ జలాన్ని స్వీకరించి దానికి తన వరప్రసాదాన్ని జోడించాడు. అతడు దాన్ని క్రొత్తగా స్థాపించలేదు. అంతకు ముందే వాడుకలో వున్న ఓ శుద్దీకరణ వస్తువును తీసికొని దాన్ని తన వరప్రసాద సాధనంగా జేసాడు. కనుక జలం జ్ఞానస్నాన సంస్కారం ద్వారా మనకు రక్షణసాధనమైంది. ఈనాడు ఈ రక్షణాన్ని మనం తిరుసభద్వారా పొందుతున్నాం.

2. యూదమతంలో జ్ఞానస్నానం

అన్నిమతాలకంటే యూదమతంలో జ్ఞానస్నానానికి ఎక్కువ ప్రాముఖ్యముండేది. కనుక ఈ యంశాన్ని ప్రత్యేకంగా విచారించి చూడాలి.

1. యూదులు తమ కర్మకాండలో మాటిమాటికి జలంతో కడుగుకొని శుద్ధిని పొందుతుండేవాళ్ళు చచ్చిన ప్రాణి దేహాన్ని ఏ వస్తువైనా తాకితే అది అపవిత్రమౌతుంది. ఆ వస్తువుని నీటితో కడిగి శుద్ధి చేయాలి — లేవీ 11, 32. ప్రజలు దేవుణ్ణి సమీపించకముందు స్నానంచేసి శుద్ధిని పొందాలి - నిర్గ 19, 10-15.యూదుల్లో అగ్రవర్గం వాళ్ళయిన పరిసయులు ప్రతి చిన్నకార్యం తర్వాతగూడ జలంతో కడుగుకొని శుద్ధిని పొందేవాళ్లు - మార్కు7, 1-4

2. అన్యజాతివాళ్ళ కొందరు యూద మతంమీద అభిమానం చూపేవాళ్లు, ఒకోసారి యూదమతంలో చేరేవాళ్ళకూడ. వీళ్ళకు యూదమత ప్రవిష్ణులని పేరు - అచ 13, 43. వీళ్ళు మొదట శుద్దీకరణ స్నానంచేసిగాని ఈవర్గం ప్రజలుగా తయారయ్యేవాళ్లుకాదు.

3. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో యూదుల్లో చాల స్నానవర్గాలు వుండేవి. ఎస్సీనులు, డమస్కవర్గంవాళ్లు, కుమ్రాను వర్గంవాళ్లు మొదలైన మఠాలు ముఖ్యమైనవి. మెస్సీయా తమ ముఠాలోనే పుడతాడని ఈ వర్గాలవాళ్ళందరూ ఆశించారు. వీళ్ళంతా ఒకరకమైన జ్ఞానస్నానాన్నిపాటించారు. వీళ్ళదృష్టిలో ఈ కర్మ పాపపరిహారాన్ని సంపాదించి పెట్టదు, కేవలం ఆ పరిహారాన్ని సూచిస్తుంది.

4. స్నాపక యోహాను ఒక ప్రత్యేకమైన జ్ఞానస్నానపద్ధతిని ప్రారంభించాడు. ఇతరవర్గాల్లో ఎవరిమీద వాళ్ళే నీళ్ళు పోసికొనేవాళ్ళ కాని యోహాను మొట్టమొదటిసారిగా తాను ఇతరులమీద నీళ్ళపోయడం ప్రారంభించాడు - మత్త 3,7.

యోహాను బోధప్రకారం చివరిరోజులు, అనగా మెస్సియా విజయంచేసే దినాలు, వచ్చాయి. మెస్సియా రాకడ కొరకు దేవుడు ప్రజలను శుద్ధి చేస్తాడు. ఈ శుద్ధి యోహాను