పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూమతంలో జలకర్మలు చాలా వున్నాయి. నీళ్ళు చిలకరిస్తారు. ఆచమనం చేస్తారు, త్రాగుతారు. పుణ్యనదుల్లో స్నానాలుచేస్తారు. మార్ధనం అనే కర్మకాండలో బ్రాహ్మణులు నీటిని ఎడమచేతితో బటుకొని కుడిచేతితో దాన్ని శిరస్సుమీద చిలకరించుకొంటారు. ఆ నీరు తమ పాపాన్ని తొలగించి బలాన్నీ పావిత్ర్యాన్నీ ప్రసాదించాలని ప్రార్ధిస్తారు. ప్రతిదిన స్నానకర్మంలో బ్రాహ్మణులు తమ శారీరక, మానసిక, వాచిక పాపాలన్నీ తొలగిపోయి తాము చేపట్టనున్న కార్యాలలో విజయం సిద్ధించాలని జపిస్తారు.

2. మానసిక శాస్త్రరీత్యా పరిశీలించి చూస్తే, జలం పాపాన్ని కడిగివేస్తుందని క్రొత్తపుట్టువుని ప్రసాదిస్తుందనీ ప్రాచీన మతాలు విశ్వసించినట్లుగా కన్పిస్తుంది. జలంమృత్యువనీ జీవాన్నికూడ తెచ్చిపెడుతుంది. కనుక అది సమాధి, మాతృగర్భంకూడ.

సి.జె.యుంగ్ అనే మానసిక శాస్త్రజ్ఞడు జలం అనేది ప్రపంచంలోని అందరు మానవుల మనస్సుల్లో మెదలే ప్రాథమిక భావాల్లో ఒకటి అని చెప్పాడు - ఆర్కెటైప్, నరుడు స్నానానికి నీళ్లల్లోకి దిగడమంటే తన అజ్ఞాత మనస్సులోకి ప్రవేశించడమని అది మృత్యువలాంటిదనీ, అతడు నీళ్ళల్లోనుండి బయటికి రావడమంటే తన జ్ఞాతమనస్సులోనికి ప్రవేశించడమనీ అది జీవంలాంటిదనీ వర్ణించాడు.

3. ఇక బైబులుని పరిశీలించినాగూడ జలానికి ఈ మృత్యువు జీవము అనే రెండు ధర్మాలు వున్నట్లుగానే కన్పిస్తుంది. తొలుత అదుపులోలేని జలం ఉండేది. దేవుని ఆజ్ఞపై ఈ జలం అదుపులోకి వచ్చింది. దానినుండి ప్రాణులు పుట్టుక వచ్చాయి - అది 1,2,20. అటుతరువాత దేవుడు జలప్రళయం కలిగించి దుర్మార్డులను నాశంచేసాడు. పుణ్యపురుషుడైన నోవాను బ్రతికించి నూత్న మానవజాతిని రూపొందించాడు - ఆది 7,7-10. తదనంతరం అతడు యిప్రాయేలీయులను రెల్లు సముద్రం దాటించాడు. కాని ఐగుప్తియులను అదే సముద్రంలో మంచివేసాడు - నిర్గ 14 ఈ సంఘటలన్నిటిలోను నీళ్ళ మృత్యువునీ జీవాన్నికూడ తెచ్చిపెడతాయి అనే భావం కన్పిస్తుంది.

క్రీస్తు కూడ సిలువబలి అనే జ్ఞానస్నానంద్వారా మరణం అనే జలంలోనికి మంచబడతాడు - మార్కు 10,38. యోనా లాగ భూగర్భంలో లేక జలగర్భంలో వుండిపోతాడు - మత్త 12,40. కాని ఆయన మృత్యుంజయుడై ఆ భూగర్భంనుండి వుత్తానమౌతాడు- 1 పేత్రు 3,19-21. ఇక్కడ నీళ్ళ క్రీస్తుకి మరణాన్నీ జీవాన్నీ తెచ్చి పెట్టలేదు. క్రీస్తే నీళ్ళకు మరణాన్నీ జీవాన్నీ ప్రసాదించాడు. ఆయన తాను మరణించి ఉత్తానమై నీళ్ళనే జ్ఞానస్నాన జలాలుగా నియమించాడు. ఈ జలాలను మనం ఈనాడు శ్రీసభలో వినియోగించుకొంటాం, శ్రీసభ అనే తల్లి గర్భంనుండి నూత్నంగా ఉద్భవిస్తాం.