పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సలహానీ సహాయాన్నీ అడుగుకోవడం మంచిది. మనం చేయబోయే ప్రతి ముఖ్యమైన కార్యంలోను, మన కెదురయ్యే ప్రతి చిక్కు సమస్యలోను వెలుగును ప్రసాదించమని కూడ ఆత్మను అడుగుకోవాలి.

ఈ సందర్భంలో భక్తులు దేవుణ్ణి సలహా అడగడాన్ని గూర్చి కొన్ని ఉదాహరణలు చూడ్డం మంచిది. రిబ్కా గర్భంలో ఇరువురు శిశువులున్నారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు గట్టిగా నెట్టుకొన్నారు, ఆమె కీడుని శంకించింది. ప్రభువు దగ్గరికివెళ్ళి సలహా అడిగింది. ప్రభువు "నీ గర్భంలో పరస్పర వైరంగల రెండు జాతులు యిమిడి వున్నాయి. పెద్దబిడ్డడు చిన్న బిడ్డడికి దాసుడౌతాడు” అని చెప్పాడు. ఆ బిడ్డలు ఏసావు యాకోబులు - ఆది 25, 22-23.

మోషే మహాభక్తుడు. అతడు చిక్కులెదురైనపుడల్లా ప్రభువుని సంప్రతించేవాడు. మస్సామెరిబాలవద్ద నీళ్ళ దొరకనందున ప్రజలు అతనిమీద తిరుగబడ్డారు. అతడు ప్రభువు ఉపదేశమడిగాడు. దేవుడు నీవు నదిని కొట్టిన కర్రతోనే కొండబండను చరవమని సలహా యిచ్చాడు. మోషే ఆలాగే చేయగా బండనుండి నీళ్ళు వెలువడ్డాయి. ఆ నీళ్ళ త్రాగి ప్రజలు సంతృప్తి చెందారు - నిర్గ 17, 4-6. ఇంకా, యీ మోషే ప్రభువు గుడారంలోకి వెళ్ళి అతనితో తన కష్టసుఖాలన్నీ చెప్పకొనేవాడు. ఆ ప్రభువుని సలహా అడిగేవాడు. మిత్రుడు మిత్రునితో మాట్లాడినట్లే దేవుడతనితో ముఖాముఖి మాట్లాడేవాడు. తన చిత్తాన్ని అతనికి తెలియజేసేవాడు - నిర్గ 33, 11.

దావీదు తాను శత్రువులతో యుద్దాలు చేసేపుడల్లా ప్రభువుని సంప్రతించేవాడు. ఓమారు బాలు పెరాసీమవద్ద అతనికి ఫి స్టీయులతో పోరు తటస్థించింది. అతడు ప్రభువుతో మంత్రాలోచన చేయగా ప్రభువు శత్రువు మీదికి పొమ్మని సలహాయిచ్చాడు. ఆ సలహా ప్రకారమే దావీదు శత్రువుల మీదికి వెళ్లి వాళ్ళ నోడించాడు - 2 సమూ 5, 19.

"ప్రభుని ఒక్క వరం కోరుకొన్నాను నాకు కావలసింది ఇదొక్కటే - నా జీవితమంతా ప్రభు మందిరంలో వసించాలనీ ఆయనను ప్రసన్నుద్ధి చేసికోవాలనీ దేవాలయంలో అతన్ని సంప్రతించి చూడాలనీ నా కోరిక"

అన్నాడు కీర్తనకారుడు. ఇతడు సమస్యల్లో ప్రభువు నుండి సలహా పొందాలని అభిలషించాడు - 27,4. ఈ భక్తుల్లాగే మనంకూడ కష్టసుఖాల్లో, ఆపదల్లో, అక్కరల్లో ఆత్మ సలహా అడుగుకోవాలి. అలా అడిగేవాళ్ళను ఆయాత్మ సరళమార్గాల్లో నడిపిస్తుంది. దేవుని బిడ్డలను దేవుని ఆత్మే నడిపిస్తుంది. - రోమా 8,14.