పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా, ఒకోసారి యితరులు తమ సమస్యలతో వచ్చి మనలను సలహా అడుగుతారు. వాళ్ళకు మనం దురాలోచనగాదు, మంచి ఆలోచన చెప్పాలి. ఈ సామర్థ్యం మన కెక్కడనుండి వస్తుంది? ఈ వరంద్వారానే జీవితంలో సిద్దాంతంవేరు. ఆచరణం వేరు. ఉపాధ్యాయుడు బోథన పద్ధతులను క్షుణ్ణంగా నేర్చుకొని వుండవచ్చు. కాని పిల్లలకు సరిగా పాఠాలు చెప్పలేకపోవచ్చు. వైద్యుడు వైద్యశాస్తాన్ని బాగా చదువుకొని ప్రధమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడై యుండవచ్చు. కాని రోగులు వచ్చినపుడు వ్యాధినిర్ణయం చేయలేకపోవచ్చు జబ్బును కుదర్చలేకపోవచ్చు. అందుకే యెపుడుకూడ సిద్ధాంతంవేరు ఆచరణం వేరు అని చెప్పాం. ఆత్మ సలహా అనే వరం ప్రధానంగా ఈ యాచరణం కొరకే ఉద్దేశింపబడింది.

ఈ వరంద్వారా మనం ఈ ప్రత్యేక పరిస్థితుల్లో, ఈ ప్రత్యేక సమస్యలో, ఏమిచేయాలో తెలిసికొంటాం, ఆత్మ నీవు ఇప్పడు ఈలా చేయి అని మన అంతరాత్మలో చెప్తుంది. లోకంలో నరుడు నరునికి హితోపదేశం చేసినట్లుగానే ఆత్మకూడ మనకు హితోపదేశం చేస్తుంది. మన తరపున మనం ఆత్మచెప్పినట్లుగా చేస్తే చాలు, సమస్యనుండి బయట పడతాం.

ఈ వరంద్వారా మనం దైవచిత్తం తెలిసికొంటాం, దేవుడు ఈ విషయంలో మనలను ఎటుపొమ్మంటున్నాడో, ఏమి చేయమంటున్నాడో గ్రహిస్తాం. ఒకమారు దైవచిత్తాన్ని గుర్తించాక ఇక మనం చేయవలసిన పనిని చేసికోవచ్చు. కాని మనకు తరచుగా దైవచిత్తమేమిటో అంతుబట్టదు. అప్పడు ఈ వరం మనకు తోడ్పడి, మనపట్ల దేవుని యభిమతమేమిటో స్పష్టం చేస్తుంది. అందుచేత ఇది చాల ఉపయోగకరమైన వరమని చెప్పాలి.

ఈ వరమే లేకపోతే ఏమౌతుంది? మన ఆలోచనలు స్పష్టంగా వుండవు. తొందరపడి, గ్రుడ్డిగా నిర్ణయాలు చేసికొంటాం. అవి మనలను అపమార్గం పట్టిస్తాయి. కనుక మనం పొరపాట్ల చేస్తాం. ఓడ ఒకరేవుకు చేరబోయి మరొక రేవుకి చేరి కూర్చుంటుంది. ఈలాంటి అనర్ధాలను వారించడానికే ఈ వరం ఉద్దేశింపబడింది.

3. ఆత్మ సలహాను ఏలా పొందాలి?

ఆత్మనుండి సలహాను పొందాలంటే ఆ యాత్మనే అడుగుకోవాలి. వినయంతోను నమ్మకంతోను వేడుకొనేవాళ్ళ మొర దేవుడు ఆలిస్తాడు. కనుకనే కీర్తనకారుడు "ప్రభూ! నీ మార్గాలను నాకు తెలియజేయి, నీ త్రోవలను నాకు ఎరుకపరచు" అని ప్రార్ధించాడు - కీర్త 25, 4 మామూలుగా మనం ఉదయకాల ప్రార్థనలోనే ఏరోజు కారోజు ఆత్మ