పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. దైవభక్తి

1.దైవభక్తి అంటే యేమిటి?

దైవభక్తి అనే వరంవల్ల దేవుణ్ణి తండ్రిలా భావించి పూజిస్తాం. దేవునికి అంకితమైన వ్యక్తులనూ వస్తువులనూ గౌరవభావంతో చూస్తాం. ఈ వరంవల్ల ప్రార్ధనం మొదలైన భక్తికృత్యాలను సంతోషంతో నిర్వహిస్తాం.

దేవుడు సృష్టికర్త కావడంవల్ల మనకు యజమానుడౌతాడు. కనుక అతన్ని సహజంగానే గౌరవిస్తాం. ఐతే ఈ వరంద్వారా ఆ ప్రభువుని తండ్రిలా భావించి పూజిస్తాం. అతన్ని నమ్ముతాం, ప్రేమిస్తాం, "మీరు దేవుని నుండి మిమ్ము భయకంపితులను చేసే బానిసపు ఆత్మను స్వీకరించలేదు. దత్తపత్రత్వాన్నొసగే ఆత్మనే స్వీకరించారు. ఆ యాత్మద్వారా మనం దేవుణ్ణి అబ్బా – అనగా, నాన్నా అని పిలుస్తాం, ఆ యాత్మ మన ఆత్మతో ఏకమై మనం దేవునికి పుత్రులమని సాక్ష్యమిస్తుంది" - రోమా 8, 14-15. పవిత్రాత్మ మన హృదయాల్లో వుండి మనచేత దేవుణ్ణి నాన్నా అని పిలిపిస్తుంది. తాను మన హృదయాల్లో వుండి మనం దేవునికి బిడ్డలమని హెచ్చరిస్తూంటుంది. దేవునికీ మనకీ తండ్రీ బిడ్డల సంబంధం వుందని గుర్తించడమే ఈ వరంలోని ముఖ్యాంశం.

ఈ వరంద్వారా దేవునికి అంకితులైన పునీతులనూ పవిత్ర వస్తువులనూ గౌరవమర్యాదలతో చూస్తాం, 1. దేవమాత దేవునితల్లి, మనతల్లికూడ. దేవునికి సన్నిహితంగా వుండే వ్యక్తి కనుక ఆమెను గౌరవించి ప్రేమిస్తాం. 2. దేవుని మహిమను తమలో యిముడ్చుకొన్నవాళ్ళు కనుక అర్చ్యశిష్ణులనూ సన్మనస్కులనూ గౌరవిస్తాం. 3, దివ్యగ్రంథం దేవుని వాక్కు అతని ప్రేమభావాలను తెలియజేసేది. కనుక ఆ గ్రంథాన్ని పూజ్యభావంతో చూస్తాం. 4. తిరుసభ క్రీస్తు స్థాపించినది. క్రీస్తుపత్ని మనకు జ్ఞానజీవాన్ని ప్రసాదించే తల్లి, దివ్యసత్రసాదంలాంటి సంస్కారాలద్వారా మనలను పోషించే తల్లి, కనుక ఆ తల్లిని గౌరవిస్తాం. ఆమెపట్ల బిడ్డల్లా మెలుగుతూ విధేయత చూపుతాం. 5. తిరుసభ అధికారియైన పరిశుద్ధ పోపుగారు క్రీస్తు స్థానంలో వుండేవ్యక్తి కనుక క్రీస్తుకిలాగే అతనికికూడ విధేయులమౌతాం. 6. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు మొదలైన వాళ్ళంతా దేవుని స్థానంలో వుండే వ్యక్తులు. కనుక వాళ్ళను గౌరవాదారాలతో చూస్తాం. దేవుడు ఎవరినైనా మన ఆధీనంలో వుంచితే వాళ్ళను తండ్రిలాగ ఆదరిస్తాం. దైవభక్తి ఇంత విస్తృతమైన వరం.