పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఇరెనేయస్ భక్తుడు "బ్రతికివున్న నరుణ్ణి దేవుని తేజస్సు అనాలి. నరుని జీవితానికి సాఫల్యం దేవుణ్ణి దర్శించడమే" అని వ్రాసాడు. ఇక్కడ ఈ భక్తుడు పేర్కొన్న దేవుని తేజస్సు ఆత్మ ప్రభావమే. ఆత్మశక్తితోనే మనం దేవుణ్ణి దర్శిస్తాం.

33. ఆత్మకు బదులుగా ముగ్గురు

1. క్యాతలిక్ సమాజానికి చెందిన మనం ఆత్మను తరచుగా మరచిపోతూంటాం. మన ప్రార్థనల్లో భక్తికృత్యాల్లో, మతాచరణంలో ఆత్మను అట్టే పట్టించుకోం. ఇది పొరపాటు. క్యాతలిక్కులమైన మనం ఆత్మను విస్మరించి ఆత్మకు బదులుగా మూడంశాల్లో శ్రద్దాభక్తులు చూపిస్తూంటాం. అవి సత్ప్రసాదం, పోపుగారు, మరియమాత. ఈ మూడంశాలను క్రమంగా పరిశీలిద్దాం.

మామూలుగా మనకు దివ్యసత్ర్పసాదంపట్ల అపార భక్తి వుంటుంది. ఉండవలసిందే. అది ప్రభువు ప్రేమ చిహ్నం. కాని పొరపాటేమిటంటే, దివ్యసత్రసాదంలో క్రీస్తుని మాత్రమే గుర్తిస్తాం. దానిలో క్రీస్తుబలీ శరీరమూ సాన్నిధ్యమూ మాత్రమే గమనిస్తాం. కాని అప్పరసాలు క్రీస్తు శరీరరక్తాలుగా ఏలా మారాయి? పవిత్రాత్మ వేంచేయడంవల్లనే కదా! అన్ని సంస్కారాలతోపాటు దీనిలో గూడ ఆత్మే పనిచేస్తుంది. ఆత్మ ఆవాహనంవల్లనే రొట్టెరసాలు క్రీస్తు శరీరరక్తాలవుతాయి. కనుక దివ్యసత్రసాదంలో క్రీస్తుతోపాటు ఆత్మసాన్నిధ్యాన్ని గూడ గుర్తించాలి. క్రీస్తుని ఆరాధించినట్లే ఆత్మనుకూడ ఆరాధించాలి. దివ్యసత్ప్రసాద భక్తి ఆత్మను విస్మరించేలా చేయకూడదు.

2. పోపుగారిపట్ల మనకు విశేష గౌరవాదరాలు వుంటాయి. ఉండవలసిందే. ప్రోటస్టెంట్ల పోపుగారి అధికారాన్ని గుర్తించరు. ఈ లోటును భర్తీచేయడానికో అన్నట్లు మనం పరిశుద్ధ తండ్రిగారిని అధికంగా గౌరవిస్తూంటాం. మంచిదే. పోపుగారు శ్రీసభలో ఐక్యతకు చిహ్నంగా వుంటారు. క్రైస్తవులంతా ఒకే విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఒకే నాయకుణ్ణి అనుసరిస్తున్నారు అనడానికి గురుతుగా వుంటారు. కాని క్రైస్తవుల ఐక్యతకు పోపుగారికంటెగూడ ముఖ్యమైన కారణం పవిత్రాత్మ. ఆత్మ అనుగ్రహంవల్లనే క్రైస్తవులు ఎన్నిదేశాల వాళ్ళయినా, ఎన్ని జాతులవాళ్ళయినా ఒక్క సమాజంగా కలసిమెలసి జీవించగల్లుతున్నారు. మన దేహంలోని అవయవాలన్నిటిని ఒక్కటిగా ఐక్యపరచేది మన ఆత్మ అలాగే క్రైస్తవులందరినీ ఒక్కటిగా ఐక్యపరచేది పవిత్రాత్మ. కనుక మనం పోపుగారిపట్ల చూపే గౌరవాదారాలు ఆత్మను మరచిపోయేలా చేయకూడదు. పోపుగారిని పట్టించుకొంటే చాలు, ఆత్మను విస్మరించినా పరవాలేదులే అనిపించేలా చేయకూడదు.