పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. మనం దేవమాతపట్ల అధిక భక్తిని చూపిస్తాం. చూపించవలసిందే. ప్రోటస్టెంట్ల దృష్టిలో క్రీస్తువేరు దేవమాత వేరు. క్రీస్తు దేవుడు, మరియమాత కేవలం సామాన్య వ్యక్తి. క్రీస్తుని ఆరాధించాలి, మరియను పట్టించుకోకపోయినా పరవాలేదు. కాని మన దృష్టిలో క్రీసూ మరియా ఎప్పడూ కలసే వుంటారు. వాళ్ళిద్దరిపట్లా తప్పకుండా భక్తి చూపించవలసిందే. కాని ఈ భక్తి మరియ చాలు, పవిత్రాత్మను స్మరించకపోయినా పరవాలేదులే అనిపించేలా చేయకూడదు. ఇది పెద్దపొరపాటు.

చారిత్రకంగాజూస్తే, ఇప్పడు మనం మరియమాతకు చేసే ప్రార్థనలు మొదట ఆత్మకు చెందినవి. ఆమెను మంచి ఆలోచనయొక్కమాత, వివేకంగల కన్యక, జ్ఞానంయొక్క ఆలయం, దేవరహస్యంగల రోజాపుప్పం అని సంబోధిస్తాం. కాని ఈ సంబోధనలు ప్రాచీనకాలంలో పవిత్రాత్మకు వర్తించేవి. మరియమాత శ్రీసభకు ఆత్మలాంటిదీ, క్రీస్తుతోపాటు ఆమె సాన్నిధ్యంగూడ మనతో వుంటుందనీ భావిస్తాం. కాని ఈ రెండుభావాలు ప్రాచీనకాలంలో పవిత్రాత్మకు వర్తించేవి. ప్రోటస్టెంటులు పవిత్రాత్మకు ఆరోపించే విషయాలు మనం మరియకు ఆరోపిస్తుంటాం.

మరియను పవిత్రపరచింది పరిశుద్ధాత్మ ఆమె గర్భంలో క్రీస్తు శిశువు నెలకొనేలా చేసింది ఆత్మ. ఆత్మ అనుగ్రహంవల్లనే ఆమె దేవమాత, వరప్రసాదాలమాత ఐంది. మరియపట్ల తప్పకుండా భక్తి చూపవలసిందే. కాని ఈ భక్తి మనం ఆత్మను మరచిపోయేలా చేయకూడదు. ఆత్మకు బదులుగా మరియమాతవుంది చాలులే అనిపించేలా చేయకూడదు.

ప్రార్థనా భావాలు

l. ఇల్డెఫోన్సుస్ అనే భక్తుడు మరియమాత నుద్దేశించి ఈలా ప్రార్ధించాడు. "అమ్మా! నీవు పవిత్రాత్మ ద్వారా క్రీస్తుని నీ గర్భంలో ధరించావు. ఆ యాత్మ ద్వారా నేనుకూడ క్రీస్తుని నా హృదయంలో ధరించేలా చేయి. ఆత్మద్వారా నీవు క్రీస్తుని ప్రేమించావు. ఆరాధించావు. ఆ యాత్మద్వారానే నేనుకూడ క్రీస్తుని ఆరాధించి ప్రేమించేలా చేయి. ఆత్మఆనాడు నీయందు నిర్వహించిన పవిత్రకార్యాలను నేడు మాయందును కొనసాగించుగాక.”

34. మన బాధ్యతలు

1. ఆత్మపట్ల మన బాధ్యతలు ఏలా వుండాలి? పౌలు పవిత్రాత్మను విచారంలో ముంచకండి అన్నాడు — ఎఫే 4,30. మనం పాపం చేసినపుడెల్లా ఆ యాత్మను దుఃఖపెడతాం. కనుక భక్తుడు పాపానికి దూరంగా వుండాలి. ఒకవేళ పాపంలోపడితే వెంటనే పశ్చాత్తాపపడి హృదయశుద్ధిని పొందాలి. ఇంకా, పౌలు ఆత్మను ఆర్పివేయకండి