పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీసభ సభ్యుల్లో పురుషులూ వున్నారు, స్త్రీలూ వున్నారు. పురుషులు శిరస్సయిన క్రీస్తుకి, అనగా నాయకుడైన క్రీస్తుకి పోలికగా వుంటారు. స్త్రీలు తల్లియైన ఆత్మకు పోలికగా వుంటారు.ఆ యాత్మలోలాగే స్త్రీలలోగూడ ప్రేమ, సేవ ప్రచురంగా కన్పిస్తాయి. ఇంకా, స్త్రీలు మరియమాతకూ శ్రీసభకూగూడ పోలికగా వుంటారు. ఈలా ఆత్మను తలపింపజేసే స్త్రీలకు శ్రీసభలో ఎక్కువ ప్రాముఖ్యముండాలి. పురుషులు వాళ్ళ వరాలను అణచివేయకూడదు. వాళ్ళ సేవలను అధికంగా వినియోగించుకోవాలి. మామూలుగా మన క్యాతలిక్ సమాజంలో స్త్రీలకు మతవిషయాల్లో స్థానం వుండదు. వేదవ్యాపక కృషిలో వాళ్ళు తోడ్పడరు. మనం వాళ్ళకు అధికంగా తర్ఫీదునిచ్చి ఎన్నో బాధ్యతలు ఒప్పజెప్పాలి.

7. ఆత్మ తల్లికి పోలికగా వుంటుంది. కనుక తల్లి బిడ్డలను ఎంత ప్రేమతో సాకుతుందో ఆత్మ మనలను అంత ప్రేమతో సాకుతుంది. బిడ్డలు తల్లి దగ్గరికి ఇష్టంతో వెత్తారు. కష్టసుఖాల్లో తల్లిని ఆశ్రయిస్తారు. అలాగే మనంకూడ ప్రీతితో ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆ యాత్మపట్ల భక్తిని అలవర్చుకోవాలి. మన కష్టాల్లో ఆ దివ్యవ్యక్తి సహాయం అడుగుకోవాలి. సుఖాల్లో అతనికి వందనాలు అర్పించుకోవాలి. ఆత్మపట్ల మనకు గాఢమైన చనువూ పరిచయమూ వండాలి.

కాని చాలమంది క్రైస్తవుల జీవితం దీనికి భిన్నంగా వుంటుంది. ఆత్మను నిజంగా అనుభవానికి తెచ్చుకొన్నవాళ్లు అరుదు. రోజువారి జీవితంలో ఆత్మచే నడిపింపబడేవాళ్ళు ఇంకా అరుదు. కాని పౌలు దేవుని బిడ్డలు దేవుని ఆత్మచే నడిపింపబడతారు అని చెప్పాడు - రోమా 2,14 అసలు మన క్రైస్తవులకు చాలమందికి పునీతులపట్ల వుండే భక్తికూడ ఆత్మపట్ల వుండదు. ఇది శోచనీయం. ఆత్మ త్రీత్వంలో మూడవ దైవవ్యక్తి. అతడు అనుగ్రహించకపోతే ఎవరూ క్రీస్తు దగ్గరికి రాలేరు. అతనికిగాకపోతే మరెవరికి భక్తి జూపుతాం?

తల్లి దగ్గరికిపోని బిడ్డకి తల్లి యేలా అనుభవానికి వస్తుంది? ఆత్మ దగ్గరికిపోని క్రైస్తవునికి ఆత్మయేలా అనుభవానికి వస్తుంది? లౌకికరంగంలో తల్లిలేని బిడ్డడికి ఎంత కొరతో ఆధ్యాత్మికరంగంలో ఆత్మలేని బిడ్డడకి అంత కొరత. కనుక ఆత్మపట్ల అధికాధికంగా భక్తిని పెంపొందించుకొందాం.

ప్రార్థనా భావాలు

1. అఫ్రాటిస్ అనే సిరియా భక్తుడు ఆత్మను తల్లితో పోలుస్తూ ఈలా చెప్పాడు. “అవివాహితుడైన క్రైస్తవ సన్యాసికి దేవుడే తండ్రి, ఆత్మమే తల్లి, అతనికి వేరే ప్రేమలు ఏవీలేవు.”