పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసాయి. ఆధ్యాత్మిక వివేకం నూత్నవేదంలోకాని స్పష్టంగా కన్పించదు. క్రీస్తుబోధలన్నీ వివేకానికి నిదర్శనాలే. ఉదాహరణకు ప్రభువు పండ్లనుబట్టి చెట్టు ఏలాంటిదో నిర్ణయించమన్నాడు - మత్త7,17. శిష్యులు సర్పాలవలె జాగరూకులుగాను, పావురాలవలె నిష్కపటులుగాను మెలగాలన్నాడు – 10,16. నరులు చక్రవర్తివి చక్రవర్తికీ, దేవునివి దేవునికీ చెల్లించాలన్నాడు - 22,21, గోపురాన్ని కట్టగోరేవాడు ముందుగా తన చేతిలో డబ్బున్నదా లేదా అని ఆలోచించాలి, యుద్దానికి బోయేరాజు ముందుగా శత్రురాజు తనకంటె బలవంతుడా కాదా అని పరిశీలించాలి అన్నాడు — లూకా 14,28-32.

పౌలు పేర్కొన్న సేవావరాల్లో వివేకంకూడ ఒకటి. ఈ వరంద్వారా మనలను దుష్టాత్మే నడిపిస్తూందో లేక సదాత్మే నడిపిస్తూందో తెలిసికొంటాం - 1కొ 12,10. యోహాను మొదటి జాబు "విూరు ప్రతిఆత్మను నమ్మకండి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు మనుష్యుడుగా వచ్చాడని వొప్పకొనే ఆత్మ దేవుని సంబంధమైంది. అలా వొప్పకోని ఆత్మ దేవుని సంబంధమైంది కాదు" అని చెప్మంది - 1యోహా 4,1-3.

ఈ బైబులు దృష్టాంతాల సారాంశమేమిటంటే, క్రైస్తవుల్లో వివేకమనే పుణ్యం ఒకటుంది. మనం దాన్ని చక్కగా పాటించాలి, మనకు ఏ సమస్యను గూర్చయినా అనుమానం కలిగితే క్రీస్తు బోధలూ, తిరుసభ బోధలూ మన అంతరాత్మకూడ వెలుగును ప్రసాదిస్తాయి.

4. వివేకాన్ని సాధించటం ఏలా?

వివేకం ఓవైపు ఆత్మ అనుగ్రహం. మరోవైపు మనం స్వయంకృషితోగూడ ఈ పుణ్యాన్ని సాధించవచ్చు. దీన్ని సాధించే మార్గాలు చాలా వున్నాయి. ఇక్కడ కొన్నిటిని పేర్కొంటున్నాం.

1. మనం ఎప్పడుకూడ స్వార్థబుద్ధితో కాక ఆధ్యాత్మిక దృష్టితో ఆయా నిర్ణయాలు చేసికోవాలి. “మానవుడు లోకాన్నంతటినీ సంపాదించినా తన ప్రాణాన్నికోల్పోతే అతనికేమి లాభం?" అన్న ప్రభువువాక్యం మన జీవితానికంతటికీ, మన నిర్ణయాలన్నిటికీ ప్రేరణం పుట్టించాలి - మత్త 16,26. ఈ ప్రేరణం కల నరుడు వివేకంతో ప్రవర్తిస్తాడు.

2. చాలమంది యోహాను పేర్కొన్న శారీరక వాంఛలు, దురాశ, అధికారవాంఛ అనే త్రిలోభాలకు లొంగిపోతారు -1యోహా 2,16, జ్ఞానియైనవాడు ఈ ప్రలోభాలకు తట్టుకోవాలి. లైంగికవాంఛలకు లొంగినవాడి మనసుకి మసకలు కమ్ముతాయి. అతడు సత్యాన్ని చూడలేడు. అలాగే దురాశలకు చిక్కినవాడుకూడ సత్యాన్ని లెక్కచేయడు.